విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది.. మూతపడే బడిని బతికించింది..!
ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల మూసివేతకు సిద్ధమైన విద్యాశాఖ అధికారులకు విద్యార్థిని తండ్రి..

Narapanenipalle School
Narapanenipalle Government School: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఫలితంగా విద్యార్థులు లేకపోవటంతో ప్రభుత్వం ఆయా పాఠశాలలను పూర్తిగా మూసివేస్తుంది. ఇదే క్రమంలో ఒక్క విద్యార్థినీ మాత్రమే ఉందనే నెపంతో ఖమ్మం జిల్లాలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలను మూసివేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. కానీ, ఆ పాఠశాలలో చదివే విద్యార్థిని తండ్రి తీసుకున్న నిర్ణయంతో అధికార యంత్రాంగం వెనక్కు తగ్గింది. అంతేకాదు.. పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి స్టూడెట్స్ సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టింది.
Also Read: ఈ కోతి చేష్టలకు పాపం కొంగలు ఏమయ్యాయో చూడండి..
ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. 2018లో 24 మంది విద్యార్థులతోపాటు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. 2022-23లో ఎనిమిది మందికి, 2023-24లో నలుగురు విద్యార్థులకు సంఖ్య పడిపోయింది. దీంతో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని మినహా మిగిలిన వారిని డిప్యూటేషన్ పై వేరే పాఠశాలలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు పంపించారు. ఈ విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదవే కీర్తన మాత్రమే పాఠశాలలో చదువుతుంది. విద్యార్థులు లేని కారణంగా స్కూల్ మూసివేతకు అధికారులు సిద్ధపడ్డారు.
Also Read: Inspirational Story: అడవిని కాపాడుతున్న లేడీ ఆఫీసర్ చిత్ర.. “పుష్ప”లాంటి వారిని ఎదుర్కొంటూ..
స్కూల్ మూసేందుకు సిద్ధమైన విద్యాశాఖ అధికారుల వద్దకు వెళ్లిన విద్యార్థిని కీర్తన తండ్రి.. స్కూల్ మూసివేయొద్దని విజ్ఞప్తి చేశాడు. అయితే, విద్యాశాఖ అధికారులు వినిపించుకోకపోవటంతో పాఠశాల మూస్తే తన కుమార్తెను చదువు మాన్పిస్తానని, అదేజరిగితే అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించాడు. దీంతో విద్యాశాఖ అధికారులు స్కూల్ మూసివేత విషయంలో వెనక్కు తగ్గారు. పాఠశాలలో ప్రవేశాల పెంపునకు అధికారులు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఇంకో టీచర్ ను తమ గ్రామంలోని స్కూల్ కు కేటాయిస్తే మా పిల్లలను పంపిస్తామని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పడంతో.. డిప్యూటేషన్ పై హిందీ పండిట్ ను స్కూల్ కు కేటాయించారు.
అయితే, ఈ స్కూల్ లో చదివే విద్యార్థులు మానివేయడానికి కోతుల బెడద కారణమని తెలుసుకున్న అధికారులు.. కోతుల నివారణకు పాఠశాల ప్రహరీపై సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అంతేకాక.. డిజిటల్ బోధన చేయనున్నామని, పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.