ఈ కోతి చేష్టలకు పాపం కొంగలు ఏమయ్యాయో చూడండి..

ప్రతీయేటా జనవరి నుంచి జూలై వరకు చింతపల్లి గ్రామంలోని చింతచెట్ల మీద సందడి చేసే సైబీరియన్ పక్షులు కొన్నేళ్లుగా రావడం మానేశాయి..

ఈ కోతి చేష్టలకు పాపం కొంగలు ఏమయ్యాయో చూడండి..

Siberian cranes

Updated On : March 23, 2025 / 10:53 AM IST

Siberian Cranes: పొడవాటి ముక్కు.. పొడవాటి కాళ్లు.. చూడచక్కని ఆకారంతో ఉండే సైబీరియన్ కొంగల పేరు వినిపిస్తే ముందుగా గుర్తుకొచ్చేది ఖమ్మం జిల్లాలోని చింతపల్లి గ్రామం. వందల కిలో మీటర్లు కాదు.. ఏకంగా ఐదు వేల కిలో మీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ ప్రతీయేటా వేసవికాలంలో సైబీరియన్ కొంగలు చింతపల్లి గ్రామంకు వస్తుంటాయి. ప్రతీయేటా జనవరి నుంచి జూలై వరకు గ్రామంలోని చింతచెట్ల మీద సందడి చేసే ఈ వలస పక్షులు మూడేండ్లుగా రావడం మానేశాయి. అయితే, ఇవి రాకపోవటానికి ప్రధాన కారణాల్లో కోతులు కూడా కారణమట.

 

సైబీరియన్ కొంగలకి, చింతపల్లి గ్రామంకు దాదాపు వందేళ్ల అనుబంధం ఉంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రతీయేటా వచ్చే సైబీరియన్ పక్షులను చింతపల్లి గ్రామస్తులు వాళ్ల బంధువుల్లా చూస్తారు. ఈ విదేశీ కొంగలు ఐదు నుంచి ఎనిమిది కేజీల వరకు బరువు పెరుగుతాయి. డిసెంబర్ నెలాఖరులోనే కొన్ని పైలట్ కొంగలు వచ్చి ఇక్కడి పరిస్థితులను, ఆహార లభ్యత, నివాస పరిస్థితులను గమనించి తిరిగి వెళ్తాయి. అన్నీ అనుకూలంగా ఉంటే జనవరి నుంచి జూలై వరకు వెయ్యికిపైగా కొంగలు ప్రతీయేటా చింతపల్లి గ్రామానికి వలసల వచ్చేవి.

 

చింతపల్లి గ్రామంలోని చింత చెట్లు, తుమ్మ చెట్లపై గూళ్లను ఏర్పాటు చేసుకొని, సమీపంలోని చెరువులతోపాటు పాలేరు రిజర్వాయర్ వరకు వేటకు వెళ్లి చేపలను ఆహారంగా తీసుకుంటూ ఇక్కడే గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. గుడ్డు నుంచి పిల్లలు బయటకు వచ్చిన తరువాత కొన్నాళ్లకు పిల్లలతో కలిసి తల్లులు కూడా తిరిగి వెళ్లేవి. అయితే, గత మూడేళ్ల నుంచి సైబీరియన్ కొంగలు చింతపల్లి గ్రామానికి రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం కోతుల బెడదే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.

 

వేల కిలో మీటర్ల దూరం నుంచి చింతపల్లికి వచ్చే సైబీరియన్ కొంగలు.. గ్రామంలోని చింత, తుమ్మ చెట్లపై గూళ్లను ఏర్పాటు చేసుకునేవి. అయితే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కోతులు చెట్లపై మకాం వేయడం, చెట్లపై ఉండే పక్షుల గూళ్లను పాడు చేయడం, కొంగల గుడ్లను కిందపడేయటం వంటి పనులు చేస్తున్నాయి. దీనికితోడు చెట్ల మీది నుంచి ఇండ్లపైకి దూకడం.. పంటలను ఆగంచేయడం వంటివి చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు కోతుల ఇబ్బందులను తట్టుకోలేక ఇండ్ల దగ్గర ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయడం, ఇంకొందరు పూర్తిగా చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో గ్రామంలో చింతచెట్ల సంఖ్య తగ్గింది. ఈ కారణంగానే కొంగల రాక తగ్గిందని స్థానికులు, అధికారులు భావిస్తున్నారు.

 

చింతపల్లి గ్రామంకు కొన్నేళ్ల నుంచి సైబీరియన్ పక్షులు రావడం తగ్గిపోవటంతో.. వచ్చే కొద్దిపాటి పక్షులకు అటవీశాఖ రక్షణ కల్పించే చర్యలు చేపట్టింది. కానీ, రానురాను పక్షులు రావడం బాగా తగ్గుతూ వచ్చింది. గత మూడేళ్ల నుంచి సైబీరియన్ పక్షులు రావడం పూర్తిగా తగ్గిపోయిందని, దీంతో.. దాదాపు వందేళ్ల ఆనవాయితీకి తెరపడుతుందని కొందరు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, అటవీశాఖ అధికారులు ఈ విషయంపై మాట్లాడుతూ.. పక్షుల వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన భరించలేక కొందరు గ్రామస్తులు పెద్ద చెట్లను నరికివేశారని, దీనికితోడు కోతుల వల్ల కూడా కొంగల రాకపై ప్రభావం పడిందని అంటున్నారు. అందుకే కొంగలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించేలా ప్లాన్ చేశామని, చింతపల్లి, పాలేరు రిజర్వాయర్ దగ్గర పక్షుల కోసం ఆర్టిఫిషియల్ గా బర్డ్ స్టాండ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.