బోరున విలపిస్తూ.. కోడిని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వృద్ధురాలు.. కాళ్లు విరగొట్టారంటూ ఫిర్యాదు.. ఖాకీలు నచ్చజెప్పినా వినలే..

ఓ వృద్ధురాలు బోరున విలపిస్తూ తాను పెంచుకుంటున్న కోడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

బోరున విలపిస్తూ.. కోడిని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వృద్ధురాలు.. కాళ్లు విరగొట్టారంటూ ఫిర్యాదు.. ఖాకీలు నచ్చజెప్పినా వినలే..

Nakrekal police station

Updated On : July 11, 2025 / 12:13 PM IST

Nalgonda District: ఓ వృద్ధురాలు బోరున విలపిస్తూ తాను పెంచుకుంటున్న కోడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నా కోడి కాళ్లు విరగొట్టాడు.. అతనిపై కేసు పెట్టండి అంటూ పోలీసులను కోరింది. ఖాకీలు అసలు విషయం తెలుసుకొని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆ వృద్ధురాలు వినిపించుకోలేదు.. దీంతో గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి స్టేషన్ నుంచి ఇంటికి పంపించేశారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన గంగమ్మ అనే వృద్ధురాలు ఓ కోడిని పెంచుకుంటోంది. ఆ కోడి వృద్ధురాలి ఇంటి పక్కనే ఉన్న రాకేశ్ అనే వ్యక్తికి సంబంధించిన గడ్డివాము వద్ద గింజలు తినేది. రాకేశ్ ఆగ్రహంతో ఆ కోడిని కర్రతో కొట్టాడు. దీంతో దాని రెండు కాళ్లు విరిగాయి. విషయం తెలుసుకున్న గంగమ్మ రాకేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

బోరున విలపిస్తూ కోడిని పట్టుకొని బుధవారం రాత్రి నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన కోడి కాళ్లు విరగ్గొట్టిన రాకేశ్ పై కేసు నమోదు చేయాలని కోరింది. పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకొని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

కోడి రేటు ఎంతో చెబితే అతనితో డబ్బులు ఇప్పిస్తాం.. ఈ చిన్న విషయానికి కేసు ఎందుకు అంటూ వృద్ధురాలికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాకు డబ్బులొద్దు.. రాకేశ్ కు శిక్షపడాల్సిందే అంటూ గంగమ్మ పట్టుబట్టింది. మీ గ్రామానికి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు వృద్ధురాలికి నచ్చజెప్పడంతో కోడిని తీసుకొని గంగమ్మ ఇంటికెళ్లింది.

ఈ ఘటనపై రాకేశ్ మాట్లాడుతూ.. నేను కోడిని అక్కడి నుంచి తరిమేయాలని మాత్రమే కర్రను విసిరానని, దానిని గాయపర్చాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. కుటుంబాల మధ్య ఉన్న వివాదాన్ని గంగమ్మ ఈ ఘటన ద్వారా తీవ్రతరం చేయాలని చూస్తుందని రాకేశ్ ఆరోపించారు. గంగమ్మ, రాకేశ్ మధ్య పరస్పర ఒప్పందం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు చెప్పారు.