Budwel Land Auction : ఎకరం రూ.41 కోట్ల 25లక్షలు, 3వేల 625 కోట్ల ఆదాయం.. భారీ ధర పలికిన బుద్వేల్ భూములు
బుద్వేల్ భూముల అమ్మకంతో హెచ్ఎండీకు 3వేల 625 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. Budwel HMDA Land Auction

Budwel HMDA Land Auction
Budwel HMDA Land Auction : మొన్న కోకాపేట, నిన్న మోకిలా.. నేడు బుద్వేల్.. ప్రాంతం ఏదైనా భూములు మాత్రం భారీ ధర పలుకుతున్నాయి. ప్లేస్ ఏదైనా ల్యాండ్స్ మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుతున్నాయి. తాజాగా బుద్వేల్ హెచ్ఎండీఏ భూములకు భారీ రేటు పలికింది. 100 ఎకరాలు ఉన్న 14 ప్లాట్లు హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయి.
బుద్వేల్ భూముల అమ్మకంతో హెచ్ఎండీకు 3వేల 625 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎకరం ధర రూ.41.25 కోట్లు పలికింది. అత్యల్పంగా ఎకరం 33 కోట్ల 25 లక్షలు పలికింది. సగటున ఎకరం ధర 36కోట్ల 25 లక్షలకు బిడ్డర్లు కొనుగోలు చేశారు. మొత్తం రెండు సెషన్ లలో భూములను వేలం వేశారు. మొదటి సెషన్ లో 7 ప్లాట్లకు రూ.2,057 కోట్లు.. రెండో సెషన్ లో 7 ప్లాట్లకు రూ.1,568 కోట్లు వచ్చింది.
హైదరాబాద్ నగరం చుట్టుపక్కల భూములు.. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భూములకు వేలం వేయగా భారీ ధర పలుకుతున్నాయి. హాట్ కేకల్లా అమ్ముడుపోతున్నాయి. కోకాపేటలో ఇటీవలే ఎకరా దాదాపు రూ.101 కోట్లు పలకడం సంచలనమైన సంగతి తెలిసిందే. ఒక్క కోకాపేటే కాదు నగరానికి చుట్టుపక్కల ఉన్న భూముల రేట్లు సైతం భారీగానే ఉన్నాయి.
మోకిలా పరిసర ప్రాంతాల్లోనూ స్థిరాస్తి ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సోమవారం నార్సింగి-శంకర్‌పల్లి రహదారి పక్కనే ఉన్న మోకిల గ్రామంలోని 165 ఎకరాల లేఅవుట్‌ను ప్రభుత్వం వేలం వేయగా చదరపు గజం.. మార్కెట్ ధర కంటే మూడింతలు పలికింది. హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో ప్లాట్‌కు అత్యధికంగా బిడ్‌లో చదరపు గజానికి రూ. 1.05 లక్షలు పలికింది. అత్యల్పంగా చదరపు గజానికి రూ.72వేలు పలికింది. సగటున చదరపు గజం రూ.80వేల 397 పలికింది.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ రోజురోజుకూ పెరిగిపోతోంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు మార్కెట్ నిపుణులు. నగర శివార్లలోని భూములకు కూడా డిమాండ్ అమాంతం పెరిగిపోతూ ధరలు చుక్కలను తాకుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూములకు ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహించగా.. 100 కోట్లకు పైగా పలికి.. దేశంలోనే రికార్డు ధరతో కోకాపేట భూములు కాసుల వర్షం కురిపించాయి. దీంతో.. దేశం మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్ భూములవైపు చూసింది. ఆ తర్వాత మోకిలా వెంచర్, షాబాద్ వెంచర్లలోని భూములు కూడా రికార్డు స్థాయిలో ధర పలికాయి. ఈ వెంచర్లు ఇచ్చిన బూస్ట్‌తో.. హెచ్ఎండీఏ పరిధిలోని మరిన్ని భూములకు ఈ-వేలం నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైంది.