పవన్ సంచలన నిర్ణయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన దూరం, బీజేపీ తరఫున ప్రచారం

pawan kalyan ghmc elections : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి విరమించుకుంది. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలిపారు జనసేనాని. గ్రేటర్ లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని పవన్ తెలిపారు. గ్రేటర్ లో ఓట్లు చీలకూడదని, విస్తృత ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని పోటీ నుంచి విరమించుకున్నట్టు పవన్ వివరించారు. తన నిర్ణయంతో కేడర్ నిరుత్సాహపడొద్దని పవన్ కోరారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ తర్వాత పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లతో భేటీ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని పవన్ ఆకాంక్షించారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతుందని పవన్ అన్నారు.
https://10tv.in/ghmc-elections-trs-candidates-third-list-released/
కాగా, గ్రేటర్ ఎన్నికల్లో పవన్ పూర్తి మద్దతు కోరినట్టు లక్ష్మణ్ తెలిపారు. భవిష్యత్తులో కూడా బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయన్నారు లక్ష్మణ్. హైదరాబాద్ లో ప్రాంతీయ విభేదాలు ఉండకూడదని లక్ష్మణ్ అన్నారు. పవన్ తో భేటీలో రెండు పార్టీలు కలిసి పని చేసే అంశంపై చర్చించినట్టు లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మార్పునకు దుబ్బాక ఫలితాన్ని తొలి అడుగుగా అభివర్ణించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీ వల్లే సాధ్యం అన్నారాయన. మార్పు కోసం చేసే కృషిలో జనసేన భాగస్వామ్యం అవుతుందన్నారు కిషన్ రెడ్డి.