రజతోత్సవ వేళ గులాబీ గూటిలో రచ్చ! ఇప్పటివరకు వరంగల్‌కు రాని హరీశ్ రావు

ఈ ముగ్గురికి తలా ఓ రెండు నియోజకవర్గాలను మాత్రమే అప్పగించారంట.

రజతోత్సవ వేళ గులాబీ గూటిలో రచ్చ! ఇప్పటివరకు వరంగల్‌కు రాని హరీశ్ రావు

Updated On : April 17, 2025 / 8:15 PM IST

రజతోత్సవ వేళ గులాబీ గూటిలో రచ్చ మొదలైందా? ప్రతిష్టాత్మక సభకు అనుకున్న ప్రాచుర్యం లభించడం లేదా? ఓరుగల్లు నేతలపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారా? హరీశ్ రావు హడావుడి అంతా ఆరంభ శూరత్వమేనా? మాజీ మంత్రులు చుట్టుపు చూపుగా మారారా? సభా నిర్వహణను పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా చూస్తున్నారా? వరంగల్ లీడర్స్ అంటేనే కేసీఆర్ భగ్గుమంటున్నారా? గులాబీ పండుగ వేళ ఇదేం కిరికిరి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ.

BRS రజతోత్సవ సభ గులాబీ దళంలో గుబులు రేపుతోందట. 2001 ఏప్రిల్‌ 27న పురుడు పోసుకున్న నాటి తెలంగాణ రాష్ట్ర సమితే నేటి భారత రాష్ట్ర సమితి.. BRSగా అవతరించింది. తన 24 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకొని ఈ నెల 27న 25వ ఏట అడుగు పెడుతోంది. ఈ పాతికేళ్ల పండుగ ఉత్సవాలను 10 లక్షల మందితో బహిరంగ సభను ఘనంగా నిర్వహించి సక్సెస్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు.

వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బహిరంగ సభకు ప్లాన్ చేసి ఆ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య మొదలైందట. సభా నిర్వహణ కోసం అప్పటివరకు యాక్టివ్‌గా తిరిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సభ ఏర్పాట్ల విషయంలో చుట్టపు చూపుగా మారిపోయారట.

ఇక సభ నిర్వహించే వరంగల్ లోనే మకాం వేస్తానని చెప్పిన హరీశ్ రావు ఇంత వరకు సభా నిర్వహణ ప్రాంతానికిగానీ, వరంగల్ నగరానికిగాని రానే రాలేదట. హరీశ్ దరావు ఒక్కసారిగా రజతోత్సవ సభా నిర్వహణ బాధ్యతల నుంచి తెరమరుగయ్యారనే చర్చ జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ గా సాగుతోంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత కూడా సభా నిర్వహణ విషయంలో కీలక పాత్ర పోషిస్తారని ఇంటర్నల్ సమావేశాల్లో కేసీఆర్ ఆదేశించారని గులాబీ శ్రేణుల్లో గుసగుసలు విన్పిస్తున్నా.. వాళ్లు కూడా ఇప్పటివరకు ఓరుగల్లు మొహం చూడలేదు. ఈ పరిణామం అటు గులాబీ శ్రేణుల్లోనూ, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

అనుమతి విషయంలో ఆదిలోనే అడ్డంకి
రజతోత్సవ సభా వేదిక ఎల్కతుర్తికి షిఫ్ట్ అయ్యాక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహణ బాధ్యతల విషయంలో అనూహ్యంగా ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. వీళ్లు వచ్చీ రాగానే అనుమతి విషయంలో ఆదిలోనే అడ్డంకి ఎదురైంది.

దీంతో పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి సభ అనుమతి కోసం హైకోర్టు మెట్లు ఎక్కగా… ఆ లోపే వరంగల్ కమిషనరేట్ సభకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో కేసీఆర్ వరంగల్ నాయకులపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. నాయకుల తీరు వల్ల అనుమతి కోసం హైకోర్టు మెట్లెక్కే పరిస్థితి వచ్చిందని వారిపై ఫైర్ అయ్యారట. ఇక లాభంలేదంటూ పార్టీ అధినేత కేసీఆరే ఇప్పుడు వరంగల్ సభ నిర్వహణ బాధ్యతలను స్వయంగా అంతా తానై పర్యవేక్షిస్తున్నారు.

పార్టీ రజతోత్సవ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఆ స్థాయి ప్రాచుర్యం ఇంత వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాకపోవడంపై అధినేత కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నారంట. ఓరుగల్లు నేతలకు ఒకరంటే మరొకరికి పొసగక పోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న కేసీఆర్.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

ఈ ముగ్గురికి తలా ఓ రెండు నియోజకవర్గాలను మాత్రమే అప్పగించారంట. మరో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మహబూబాబాద్ బాధ్యతలిచ్చారు. మొత్తం 10 లక్షల జనసమీకరణ కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతలకు టార్గెట్లు పెట్టారు.

ఏది ఏమైనా పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా కదిలి ఎల్కతుర్తి సభను విజయవంతం చేస్తాయా? రాష్ట్రంలో పార్టీకి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపించాలనుకున్న కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? వేచి చూడాలి..