Harsha Sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు.. సజ్జనార్ ఫైర్

యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు బిగ్ షాకిచ్చారు. ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ..

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు.. సజ్జనార్ ఫైర్

Harsha Sai VC Sajjanar

Updated On : March 16, 2025 / 1:32 PM IST

Harsha Sai: యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు బిగ్ షాకిచ్చారు. ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. గత కొన్ని నెలల నుంచి సజ్జనార్ నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వారిపై కేసులు పెట్టి జైల్లో పడేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

 

సజ్జనార్ ట్వీట్ ప్రకారం.. ‘‘నేను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకుంటోన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై మాత్రమే పోరాడుతున్నాను. వారు తమను అనుసరిస్తోన్న లక్షలాది మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది. దేశ భవిష్యత్ ను అగమ్యగోచరం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో చాలా మంది యువకులు తమ జీవితాలు ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ చేతిలో పెడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక, ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఇప్పటికే ఎంతో మంది జీవితాలను విచ్ఛిన్నం చేశాయి. ఆలస్యం కాకముందే అందరూ మేల్కోండి. బెట్టింగ్ యాప్స్ తో కలిగే నష్టాన్ని గుర్తించండి. ఇది మీ వ్యక్తిగత జీవితానికి, మీ భవిష్యత్త్ కు, మీ కుటుంబ శ్రేయస్సుకు, అలాగే మన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది’’ అంటూ సజ్జనార్ పేర్కొన్నారు.

 

అలాంటివారినా మీరు ఫాలో అయ్యేది..?
కొద్దిసేపటికే సజ్జనార్ మరో ట్వీట్ చేశారు. ‘‘బెట్టింగ్ యాప్‌లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్నారు. వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్‌ స‌మాజంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమాజహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా!? ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి.’’ అంటూ సజ్జనార్ పేర్కొన్నారు.

 

హర్షసాయిపై కొన్ని నెలల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. అయితే, బెయిల్ రావడంతో అతను ఊపిరిపీల్చుకున్నాడు. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారన్న వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు హర్షసాయిపై కేసు నమోదు చేశారు.