Pranay case: ప్రణయ్ హత్య తర్వాత కూడా ఇలాంటివి జరిగాయి.. ఈ తీర్పుతో వారికి కనువిప్పు కలగాలి: ప్రణయ్ తండ్రి
ప్రణయ్‌ను కోల్పోయిన తన బాధను ఎవరూ తీర్చలేరని చెప్పారు.

Pranay Father
తెలంగాణలో 2018లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో ఇవాళ తీర్పు వచ్చింది. ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్షతో పాటు మిగిలిన దోషులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.
దీనిపై ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి స్పందించారు. నేరాలు చేసేవారికి కోర్టు ఇచ్చిన తీర్పుతో కనువిప్పు కలగాలని అన్నారు. ప్రణయ్ హత్య తర్వాత కూడా ఎన్నో పరువు హత్యలు జరిగాయని చెప్పారు.
అటువంటి నేరస్తులు అందరికీ నేటి తీర్పుతో కనువిప్పు కలగాలని పెరుమాల బాలస్వామి అన్నారు. ప్రయణ్‌ను హత్య చేయడంతో అమృతకు భర్త లేడని, తనకు కొడుకు లేడని, తన మనవడికి తండ్రి లేడని చెప్పారు.
దోషుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు పడిందని అన్నారు. హత్యలకు పాల్పడడం విచారకరమని బాలస్వామి చెప్పారు. ఏదైనా గొడవలు, అభిప్రాయ భేదాలు వంటివి ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.
ఈ తీర్పుతోనైనా అటువంటి హత్యలు ఆగిపోవాలని చెప్పారు. ఈ కేసులో తొలుత నుంచి సహకరించిన డీఎస్పీ శ్రీనివాస్‌కి థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. తాము ఐదున్నర ఏళ్ల పాటు కోర్టు తీర్పుకై వేచి చూశామని, ఈ తీర్పుతో సంతృప్తి చెందుతున్నామని తెలిపారు. 100 మంది సాక్షులతో, 1,600 పేజీల చార్జిషీట్‌తో ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసును పరిష్కరించారని చెప్పారు.
న్యాయవాది దర్శనం నరసింహ ఎటువంటి ప్రలాభాలకు లొంగకుండా న్యాయం పోరాటం చేశారని అన్నారు. ప్రణయ్‌ను కోల్పోయిన తన బాధను ఎవరూ తీర్చలేరని చెప్పారు. హత్యలు చేసుకోవడం సరైంది కాదని తెలిపారు. తనకు ఎవరి మీదా కోపం లేదని, హత్యలు ఆగాలని సాక్షాలు చెప్పామని అన్నారు. దేశంలో చట్టం, న్యాయం అనేవి ఉన్నాయని రుజువైందని తెలిపారు.