Telangana : మూఢనమ్మకాలతో పెరుతున్న‘కడుపు కోతలు’..ముహూర్తం చూసుకుని బిడ్డను కంటున్న వైనం..
తెలంగాణలో మూఢనమ్మకాలతో ‘కడుపు కోతలు’పెరుగుతున్నాయి. మంచి రోజు, తిథి, నక్షత్రాలు చూసుకుని మరీ సిజేరియన్ చేయించుకుంటున్నారు. దీని కోసం ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్స్ బుక్ చేసుకుని సర్జరీలకు అడ్వాన్స్ లు ఇస్తున్నారు.కాసులకు కక్కుర్తి పడి డాక్టర్లు సిజేరియన్లు చేసిపారేస్తున్నారు.

Pregnants Caesarean Section After Seeing A Good Moment
Telangana : తెలంగాణలో మూఢనమ్మకాలతో ‘కడుపు కోతలు’పెరుగుతున్నాయి. మంచి రోజు, తిథి, నక్షత్రాలు చూసుకుని మరీ సిజేరియన్ చేయించుకుంటున్నారు. దీని కోసం ప్రైవేటు ఆస్పత్రులలో బెడ్స్ బుక్ చేసుకుని సర్జరీలకు అడ్వాన్స్ లు ఇస్తున్నారు.కాసులకు కక్కుర్తి పడి డాక్టర్లు సిజేరియన్లు చేసిపారేస్తున్నారు. ఎడాపెడా డబ్బులు సంపాదిస్తున్నారు. ముహూర్తం చూపించుకున్నారా? ఏ సమయానికి సర్జరీ చేసి బిడ్డను బయటకు తీయాలి? అని అడిగి మరీ సర్జరీలు చేస్తున్నారు.
ఫలానా టైమ్‌కి మత్తు మందు ఇవ్వాలి..ఫలానా టైమ్‌కి బిడ్డ బయటకు రావాలి..ముహుర్తాల పిచ్చితో సిజేరియన్లు..సమయం, తేదీ చూసుకుని సర్జరీలు..
స్పెషల్ డేట్స్‌లో ప్రసవం కోసం ఆరాటాలు..గర్భిణుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి మూఢనమ్మకాలు..కడుపులోని పసిగుడ్డు ఈ లోకంలోకి రావాలంటే ఆ తల్లి పురిటినొప్పులు భరించాల్సిందే. కానీ ఇప్పుడలా కాదు. అమ్మ పొట్ట కోయకుండా బిడ్డ పుట్టట్లేదు. అమ్మ కడుపుకు కోత తప్పట్లేదు. సిజేరియన్ లేకుండా డాక్టర్లు బిడ్డను బయటకు తీయట్లేదు. దీంతో రోజురోజుకు సాధారణ ప్రసవాలు తగ్గిపోతున్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతున్నాయి. వీటికితోడు ముహుర్తాలు చూసి డెలివరీలు చేయించుకునే ట్రెండ్ కూడా గర్భిణుల పాలిట శాపంగా మారింది.
గృహ ప్రవేశాలకు.. పెళ్లిళ్లకు.. కొత్త వ్యాపారాలకు ముహూర్తాలు చూసుకోవడం కామన్. కానీ, కడుపులో ఉన్న బిడ్డకు తల్లి జన్మనివ్వడానికి కూడా రోజు.. నక్షత్రం.. ముహూర్తం చూసుకుంటున్న కల్చర్ పెరిగిపోతోంది. చాలామంది దంపతులు పూజారుల దగ్గరకు వెళ్లి మరీ ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. ఫలానా రోజు.. ఫలానా సమయం బాగుందని పంతుళ్లు చెప్తే.. ఆ తర్వాత డాక్టర్లను కలిసి అదే సమయానికి డెలివరీ చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో నార్మల్ డెలివరీ కావాల్సిన వాళ్లకు కూడా సిజేరియన్ తప్పట్లేదు. మంచి ముహూర్తంలో పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ అందుకోసం సిజేరియన్ల వైపు మొగ్గుచూపడమే ఆందోళన కలిగిస్తోంది. కొన్ని సందర్భాల్లో వారం ముందుగానే అపరేషన్ చేయాలని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇలా చేస్తే తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పినా వినట్లేదు. సంక్రాంతి, దసరా లాంటి పండగలు.. జనవరి ఫస్ట్.. ఆగస్టు 15, గాంధీ జయంతి లాంటి ప్రత్యేక తేదీలు.. పెళ్లి రోజు, పుట్టిన రోజు అంటూ ప్రత్యేక సందర్భాలకు గుర్తుగా తమ పిల్లల పుట్టిన రోజులు ఉండాలని కోరుకునేవారు కూడా ఈ మధ్య ఎక్కువయ్యారు. ఈ పిచ్చి ఏ స్థాయికి చేరిందంటే గర్భిణికి ఎప్పుడు మత్తు ఇవ్వాలి.. ఎప్పుడు బిడ్డకు బయటకు రావాలన్న విషయాల్ని కూడా పూజారులే నిర్ణయిస్తున్నారు. ఈ పరిస్థితిపై తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసవంలో ముహూర్త బలం చూసుకోవడం కూడా ప్రైవేట్‌గా సిజేరియన్లు పెంచుతోందని.. దీన్ని అరికట్టేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
ఒకప్పుడు గర్భం ధరించింది మొదలు.. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు మహిళల్ని సాధారణ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. మా బిడ్డ సున్నితంగా పెరిగింది.. నొప్పులు తట్టుకోలేదంటూ తల్లిదండ్రులు.. మా ఆవిడ కష్టపడటం చూడలేనంటూ భర్తలు.. వామ్మో ఐదారు గంటలు నొప్పులు పడటం నావల్ల కాదు.. సిజేరియన్ చేయండంటూ గర్భిణులు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారంతా ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు.
నెలలు నిండకున్నా.. ముహూర్తాల కోసం సిజేరియన్లు చేస్తే.. తల్లీబిడ్డలకు ముప్పు తప్పదు. తల్లి కడుపులో కనీసం 37 వారాలు నిండిన శిశువులే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే తక్కువ బరువు, ఊపిరితిత్తులు సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని.. ఫీడింగ్ సరిగా తీసుకోలేని స్థితిలో శిశువులు ఇబ్బందులు పడతారని చెప్తున్నారు. అయితే ఎవరెన్ని చెప్పినా.. నరనరాన జీర్ణించుకుపోయిన మూఢ నమ్మకాల పిచ్చిని వదిలించడం అంత ఈజీ కాదు.