Sritej Discharged: పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. 5 నెలల తర్వాత ఆసుపత్రి నుంచి బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్

ప్రస్తుతం శ్రీతేజ్ మాట్లాడలేకపోయినా.. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Sritej Discharged: పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. 5 నెలల తర్వాత ఆసుపత్రి నుంచి బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్

Updated On : April 29, 2025 / 10:18 PM IST

Sritej Discharged: హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందాడు శ్రీతేజ్. 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో అతడికి చికిత్స అందించారు డాక్టర్లు. 146 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యాడు.

ప్రస్తుతం శ్రీతేజ్ మాట్లాడలేని పరిస్థిలో ఉన్నాడు. అయితే, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్ల బృందం తెలిపింది. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ కేంద్రానికి శ్రీతేజ్ ను తరలించారు. శ్రీతేజ్ కు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చని వైద్యులు తెలిపారు.

బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో వైద్యులు అతడిని ఆసుపత్రి సంరక్షణ నుండి డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు. మరింత కోలుకోవడానికి పునరావాస కేంద్రానికి తరలించాలని సిఫార్సు చేశారు.

Also Read: అంతు చూస్తాం.. సైన్యానికి ఫుల్‌ పవర్స్‌..! త్రివిధ దళాధిపతుల భేటీలో మోదీ సంచలన ప్రకటన

తేజ్ కిమ్స్ లో మొత్తం 4 నెలల 25 రోజులు చికిత్స పొందాడు. దాదాపు 15 రోజుల క్రితం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి తేజ్ ను జనరల్ వార్డుకు తరలించారు. శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని, ఇన్ ఫెక్షన్లు లేవని వైద్యులు నిర్ధారించారు. అయితే, ఫిజియోథెరపీ, పునరావాస కేంద్రంలో నిరంతర సంరక్షణను సూచించారు. దాదాపు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ పొందిన తర్వాత ఇంటికి తీసుకెళ్లచని పేర్కొన్నారు.

శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి పై ఆయన తండ్రి భాస్కర్ మాట్లాడారు. “తేజ్ కళ్ళు తెరిచాడు. మేము అతనికి ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ద్రవ పోషకాహారం అందిస్తున్నాము. అయితే, అతని మెదడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతను మనలో ఎవరినీ గుర్తించలేకపోతున్నాడు. ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండటంతో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుందని, పునరావాసం కోలుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు సూచించారు. శ్రీతేజ్‌కు జీవితాంతం సంరక్షణ అవసరం” అని భాస్కర్ చెప్పారు.

ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబానికి మద్దతిచ్చిన వారందరికీ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. “పుష్ప 2 చిత్ర బృందం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ప్రభుత్వం గణనీయమైన సహాయం అందించాయి. శ్రీతేజ్ ఆసుపత్రిలో చేరిన రెండవ రోజు నుండి వారు మాకు అండగా నిలిచారు. KIMS యాజమాన్యం వైద్య చికిత్స ఖర్చులకు సంబంధించి ఎటువంటి సమస్యలను లేవనెత్తలేదు. డిశ్చార్జ్ సమయంలో కూడా వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు” అని భాస్కర్ తెలిపారు.