Revanth Reddy: కాంగ్రెస్ జెండాకు ఉన్న పవర్ అది.. రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్

నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే.. నాలుగేళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిండు.

Revanth Reddy: కాంగ్రెస్ జెండాకు ఉన్న పవర్ అది.. రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్

Revanth Reddy Powerful speech in Tandur

Revanth Reddy- Tandur : కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అడ్డుకునేందుకే బీఆర్ఎస్ నాయకుడు పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా సీఎం కేసీఆర్.. మహేందర్ రెడ్డి ముఖం చూడలేదని.. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న భయంతో ఆయనకు మంత్రి పదవి కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జెండాపై గెలిచి అధికార పార్టీకి అమ్ముడుపోయారంటూ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. చేవెళ్ల ప్రజా గర్జన సభ సన్నాహక సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి గురువారం తాండూరులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.

కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే..
”కాంగ్రెస్ పార్టీకి తాండూరు గడ్డ కంచుకోట అని కార్యకర్తలు నిరూపించారు. కాంగ్రెస్ జెండాపై గెలిచి కొంత మంది అమ్ముడుపోయినా కార్యకర్తలు మాత్రం పార్టీని కాపాడారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం. ఇందిరమ్మ రాజ్యం తెచ్చి జెండా మోసిన కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటాం. తాండూరు కార్యకర్తలకు చెబుతున్నా.. మీకు నేను అండగా ఉంటా. 26న చేవెళ్ల సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరుతున్నా. నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే.. నాలుగేళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిండు. ఇవాళ మంత్రి పదవి ఇచ్చిండు. నిన్నటి వరకు జట్లు జట్లు పట్టుకోన్నోళ్లు ఇవాళ పదవులు పంచుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ మూడు రంగుల జెండాకు ఉన్న పవర్. వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి తప్పా తాండూరుకు ఒరిగిందేంటి?

తాండూరుకు సాగునీరు ఇవ్వని వారిని బండకేసి బాదాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ దందాలు చూసినా బీఆరెస్ నేతలవే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తాండూరుకు సాగునీరు వస్తుంది. కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ మిత్తికే సరిపోయింది. రాష్ట్రంలో పేదోడికి వంద గజాలు కొనే శక్తి లేకుండాపోయింది. మీ దోపిడీ కోసమేనా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది? పేదోళ్ల బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాల”ని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన హైకోర్ట్ .. డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా ప్రకటిస్తు కీలక తీర్పు..

ముదిరాజులపై పగబట్టిన కేసీఆర్
నీళ్లు, నిధులు, నియామకాల హామీని కేసీఆర్ అటకెక్కించారని.. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించారని వికారాబాద్ లో రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో సామాజిక న్యాయం లేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం అందుతుందని అన్నారు. బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో 119 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదని, ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారని తెలిపారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ముగ్గురూ తోడు దొంగలని.. బీఆరెస్, ఎంఐఎంకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని పేర్కొన్నారు.

Also Read: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి.. చాలా రోజుల తర్వాత రాజ్ భవన్‭కు వచ్చిన కేసీఆర్

పరిగి రైతులు ఏం అన్యాయం చేశారు?
తెలంగాణలో గోదావరి జలాలు కేవలం మెదక్ జిల్లాకే ఎందుకు పరిమితమయ్యాయి.. పరిగి రైతులు ఏం అన్యాయం చేశారు.. కేసీఆర్ పరిగికి ముఖ్యమంత్రి కాదా? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పరిగిలో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ”కేసీఆర్ ఉద్యోగం ఊడుతుందనే మన పార్టీలోకి వస్తా అన్న వారిని రాకుండా చేస్తున్నారు. ముదిరాజులకు, మాదిగ బిడ్డలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్ కు ఓట్లు ఎందుకు వేయాలి? వర్గీకరణకు సహకరించని కేసీఆర్ కు మాదిగ బిడ్డలు ఎందుకు ఓటు వేయాలి? మన పిల్లలు బర్లు, గొర్లు పెంచుకోవాలట.. వాళ్ల పిల్లలు రాజ్యాలు ఎలుతారట. నీళ్లు జగన్ రెడ్డికి, నిధులు మేఘా కృష్ణారెడ్డికి, నియామకాలు కేసీఆర్ కు వెళ్లాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంద”ని అన్నారు.