చందానగర్ ఖజానా జ్యూవెలరీ షాపులో దోపిడీ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఎంత బంగారం దోచుకెళ్లారంటే..?
పక్కాప్లాన్ ప్రకారమే దుండుగులు జ్యూవెలరీ షాపులో దోపిడీకి తెగబడినట్లు పోలీసులు తెలిపారు. వీరినికోసం 10బృంందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Khazana jewellery shop
Robbers in jewellery shop Chandanagar: హైదరాబాద్ నగరం చందానగర్ ప్రాంతంలోని ఖజానా జ్యూవెలరీ దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. ఏడుగురు దొంగల ముఠా మంగళవారం ఉదయం బంగారం షాపులోకి చొరబడి సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. తుపాకీతో తూటాలతో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిని బెదిరించి నగలను దోచెకెళ్లారు. దుండగుల కాల్పుల ఘటనలో డిప్యూటీ మేనేజర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.. దుండగల కోసం 10 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
పక్కాప్లాన్ ప్రకారమే దుండుగులు జ్యూవెలరీ షాపులో దోపిడీకి తెగబడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. షాపు ఓపెన్ చేసే సమయం కోసం దుండగులు బయట వేచిఉన్నట్లు గుర్తించారు. షాపు ఓపెన్ చేసిన వెంటనే మాస్క్ ధరించి ఓ దుండగుడు రెక్కీ నిర్వహించారు. లోపల సెక్కూరిటీ సిబ్బందితోపాటు కొంతమంది ఎగ్జిక్యూటివ్ లు మాత్రమే ఉండటాన్ని గమనించిన దుండగుడు.. అనంతరం మిగిలిన నిందితులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా తుపాకీలతో షాపులోకి చొచ్చుకెళ్లిన ఏడుగురు దుండగులు.. సిబ్బందిని బెదిరించారు.
తుపాకీ గురిపెట్టి షాప్ లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. ఈ సమయంలో డిప్యూటీ మేనేజర్ సతీష్ ప్రతిఘటించడంతో అతని తొడ భాగంలో కాల్పులు జరిపారు. కాల్పులు శబ్దంతో అలర్ట్ అయిన షాపులోని మిగిలిన సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న దుండగులు ఘటన స్థలం నుంచి కారులో పరారీ అయ్యారు. వెళ్తూవెళ్తూ కేజీ వెండి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే ఖజానా జ్యువెలరీలో దోపిడీకి యత్నించారని చెప్పారు. జ్యువెలరీలోకి ఉదయం 10.35 గంటలకు దుండగులు చొరబడ్డారు. 10.56 నిమిషాల వరకు సుమారు పది నిమిషాలుపాటు దోపిడీ దొంగలు లోపలే ఉన్నారు. మాస్కులు, కర్చీఫ్ లు ముఖానికి కట్టుకొని లోపలికి చొరబడ్డారు.
తుపాకులతో లోపలికి వచ్చి బంగారం ఎక్కడ ఉంది అంటూ షాపులోని సిబ్బందిని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో డిప్యూటీ మేనేజర్ సతీష్ తొడ భాగంలో గాయమైందని సీపీ తెలిపారు. అయితే, ఈ ఘటనలో బంగారం చోరీకి గురవ్వలేదని చెప్పారు. చేతికి అందిన సిల్వర్ తీసుకొని వెళ్లారు. నిందితులను పట్టుకోవడానికి పది బృందాలను ఏర్పాటు చేశాం. బార్డర్ చెక్ పోస్టులను అప్రమత్తం చేశామని సీపీ అవినాష్ మహంతి తెలిపారు.