పండుగ పూట విషాదం, మట్టిమిద్దె కూలి ఐదుగురు మృతి

  • Published By: madhu ,Published On : October 25, 2020 / 07:12 AM IST
పండుగ పూట విషాదం, మట్టిమిద్దె కూలి ఐదుగురు మృతి

Updated On : October 25, 2020 / 7:25 AM IST

roof collapsed in wanaparthy Five Killed : పండుగ పూట వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో తీవ్ర విషాదం నెలకొంది. 2020, అక్టోబర్ 24వ తేదీ శనివారం అర్థరాత్రి మట్టిమిద్దె కూలి ఐదుగురు చనిపోయారు. గోపాల్‌పేట మండలంలోని బుద్ధారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ్మ కుటుంబ సభ్యులు చనిపోయారు.



నర్సింహ ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన భార్య మణెమ్మ గ్రామంలో నివసిస్తుండగా, ఆమె కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కోసం తమ కుటుంబాలతో గ్రామానికి వచ్చారు. రాత్రి కార్యక్రమం ముగియగా భోజనాల అనంతరం 9 మంది ఓ గదిలో పడుకున్నారు. ఆ గది పైకప్పు అర్ధరాత్రి కూలడంతో అందులో పడుకున్న మణెమ్మతోపాటు ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ, ఉమాదేవి , మనవరాళ్లు వైష్ణవి, అక్షయ అక్కడిక్కడే మృతి చెందారు.



మూడో కుమారుడు కుమారస్వామి తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కుమారస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన భార్య సుప్రజ, కుమార్తెలు వైష్ణవి, అక్షయ ఈ ప్రమాదంలో చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.