RS Praveen kumar : నా మీద ఒక్క కేసు పెడితే, కోట్ల మంది ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారు

RS Praveen kumar : నా మీద ఒక్క కేసు పెడితే, కోట్ల మంది ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారు

R S Praveen Kumar

Updated On : July 23, 2021 / 10:47 PM IST

RS Praveen kumar : పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ లో నా పై పోలీసులు కేస్ పెట్టారని… వాటికి నేను భయపడను అని ఇటీవల ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ హుజరాబాద్‌లో దళిత బంధు కోసం ఖర్చు పెట్టే వెయ్యి కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెడితే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ మారుతుందని ఆయన సలహా ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ లలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు ఉన్నారని…మనమంతా పోరాడి బహుజన రాజ్యం సృష్టించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం వచ్చి మళ్ళీ మోసం చేస్తారు,అలాంటివి మళ్ళీ రానీయకండి. మనం అంత కలిసి అధికారం దక్కించుకోవాలని ఆయన అన్నారు.

ఇప్పుడు రాకపోతే ఇటువంటి అవకాశము మళ్ళీ వెయ్యి ఏళ్ళు వరుకు రాదు. స్వాతంత్ర్యము వచ్చి 75 ఏళ్ళు అయింది, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉంది…ఆ బతుకులు మార్చడానికే నేను నా పదవికి రాజీనామా చేసి త్యాగం చేసి వచ్చానని ఆయన చెప్పారు. మాకు నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం కావాలి..ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబములో చాలా బాధ ఉంటుంది. కోట్ల మంది బాగుపడాలనే నేను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్ కుమార్ అన్నారు.