కోటి ఇసుక రేణువులతో సైకిత లింగం… శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని శిల్పం

  • Published By: sreehari ,Published On : October 10, 2020 / 09:07 PM IST
కోటి ఇసుక రేణువులతో సైకిత లింగం… శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని శిల్పం

Updated On : October 10, 2020 / 9:28 PM IST

Kotilingalam : కోటి ఇసుక రేణువుల సమూహం.. త్రేతాయుగంలో మునీశ్వరులచే ప్రతిష్టించబడిన సైకత లింగం. శాతవాహనాలు నిర్మించిన పవిత్ర పరమేశ్వరాలయం, శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని వైనం. ఇదంతా.. జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం గురించే. శాతవాహనుల రాజధానిలో వెలిసిన.. ఆ పురాతన శివాలయం ప్రాశస్త్యం, శివలింగం వెనకున్న చరిత్రపై.. జగిత్యాల జిల్లా పరిధిలోని వెల్గటూర్ మండల పరిధిలో ఉంది కోటిలింగాల.



ఆనాడు.. శాతవాహనుల రాజధానిగా ఖ్యాతి గాంచిన కోటిలింగాల.. ఇప్పుడు పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఈ ప్రాంత చరిత్రకు ఎన్నో ఆధారాలు.. ఈ నేల గర్భంలోనే దాగి ఉన్నాయి. చరిత్రకారుల తవ్వకాల్లో.. కోటిలింగాల విశిష్టతను తెలిపే ఆధారాలెన్నో బయటపడ్డాయి. కోటిలింగాల గ్రామంలో గోదావరి ఒడ్డున కోటేశ్వరస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు శివుడు.

సైకత లింగం శక్తితో కోరికలు తీరుతాయని :
ఈ శివలింగం పూర్తిగా ఇసుక రేణువులతో తయారుచేసింది. అంటే.. సైకత శివలింగమన్నమాట. దీనిని త్రేతాయుగంలో మునులు ప్రతిష్టించారని.. శాతవాహనులు ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు. శతాబ్దాలు గడుస్తున్నా.. కోటిలింగాల సైకత శివలింగం చెక్కుచెదరకపోవడం ఇక్కడి విశేషం.



ఇదంతా.. శివయ్య మహిమేనని భక్తులు విశ్వసిస్తారు. ఆ సైకత శివలింగానికి ఉన్న శక్తులతోనే.. తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మిగతా శైవక్షేత్రాల్లో కంటే భిన్నంగా.. కోటిలింగాలలో శివారాధన జరుగుతుంది. ఇక్కడ పుష్యమాసంలో.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మిగతా శైవక్షేత్రాల్లో.. శివరాత్రి రోజున శివకల్యాణం జరిగితే.. కోటీశ్వరస్వామి ఆలయంలో మాత్రం శంకరజయంతి రోజును స్వామివారి కల్యాణం జరుగుతుంది.



కోటిలింగాల సైకత లింగం.. మహిమ గల లింగమని భక్తులు విశ్వసిస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే ఆలయంగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. స్వామివారి మూలవిరాట్టుకు.. శివధనస్సుతో పాటు అర్ధచంద్రాకారంలో.. చంద్రుడు కూడా ఉంటాడట. సైకత లింగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప.. ఈ ఆకారాలు భక్తులకు కనిపించవు.



కోటిలింగాల గ్రామానికి 4 దిశలా కోటలున్నాయి. ఈశాన్య దిశలోని కోటపై.. కోటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. మిగతా 3 దిక్కుల్లో.. ఎల్గముల కోట, నక్కల కోట, మూల కోటలున్నాయి. ఊరికి ఈశాన్య దిశలో.. స్వామివారు కొలువై ఉండటంతో.. గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామస్తులు విశ్వసిస్తుంటారు.