Ruby Hotel Fire Accident : సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదం.. సీసీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు.. క్షణాల్లో అంతా భస్మం
సికింద్రాబాద్ రూబీ హోటల్ లోని ఎలక్ట్రిక్ బైక్స్ షోరూమ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.

Ruby Hotel Fire Accident : సోమవారం అర్థరాత్రి సికింద్రాబాద్ రూబీ హోటల్ లోని ఎలక్ట్రిక్ బైక్స్ షోరూమ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. రాత్రి 9 గంటల 17 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. సెల్లార్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. సిలిండర్లు కూడా ఉండటంతో మంటల తీవ్రత పెరిగింది. అనంతరం మొదటి అంతస్తుకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8మంది ప్రాణాలు కోల్పోయారు.
తొలుత సెల్లార్ లోనే మంటలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పూర్తిగా వ్యాపించాయి. క్షణాల్లోనే అంతా కాలి బూడిదైపోయింది. పొగ వెలువడిన 15 సెకన్లలోనే భారీ పేలుడు సంభవించింది. కవర్ కప్పి ఉన్న బైక్స్ ను సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీలో గమనించవచ్చు.
సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో ఉన్న ఐదంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలోని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీంతో పరిసర ప్రాంతంలో దట్టమైన పొగ ఆవహించింది. సెల్లార్‌లో 5 సిలిండర్లు, 40 ఈ బైక్‌లు, బైక్‌లు, 2 టు వీలర్లు, ఒక జనరేటర్ ఉన్నట్టు గుర్తించారు. లిథియం బ్యాటరీలు మంటల్లో కాలిపోవడంతో పొగ ఎక్కువగా వ్యాపించిందన్నారు అధికారులు.
ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో హోటల్ ఓనర్ బగ్గా రంజిత్‌తో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో దట్టమైన పొగతో ఊపిరాడక చనిపోయారు. నిజానికి సెల్లార్‌లో ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు చేయకూడదు. కానీ యాజమాని అందుకు విరుద్దంగా వ్యవహరించాడు. భవన యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి మహమూద్ అలీ.