Telangana Congress: ఆసక్తికరంగా కాంగ్రెస్ రాజకీయం.. సీనియర్ నేతలు రివర్స్ అవుతారా?

కాంగ్రెస్‌లో ఆధిపత్య రాజకీయం కొత్త కాకపోయినా.. ఎన్నికల వేళ ఈ తరహా రాజకీయం జోరు పెరగడంతో కలకలం రేగుతోంది.

Telangana Congress: ఆసక్తికరంగా కాంగ్రెస్ రాజకీయం.. సీనియర్ నేతలు రివర్స్ అవుతారా?

senior leaders resist newly joined leaders in telangana congress

Updated On : September 2, 2023 / 2:33 PM IST

Telangana Congress Party: ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో (operation akarsh) భాగంగా పార్టీలో కొత్తగా చేరిన వారికి కాంగ్రెస్ మార్క్ రాజకీయం గుబులు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే టిక్కెట్లపై ఆశతో కాంగ్రెస్ హస్తాన్ని అందుకుంటే.. సీనియర్ నేతలు రివర్స్ అవ్వడమే కాకుండా ఎక్కడ హ్యాండిస్తారోనని భయపడుతున్నారట కొత్త నేతలు. గద్వాల, బాల్కొండ, కరీంనగర్ నియోజకవర్గాల్లో ఈ తరహా తలనొప్పులు ఎక్కువగా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా పాత-కొత్త నేతల మధ్య సమన్వయం కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్‌గా మారిందట.. అసలు కాంగ్రెస్‌లో సీనియర్-జూనియర్ నేతల మధ్య అంతరమేంటి?

కాంగ్రెస్‌లో ఆధిపత్య రాజకీయం కొత్త కాకపోయినా.. ఎన్నికల వేళ ఈ తరహా రాజకీయం జోరు పెరగడంతో కలకలం రేగుతోంది. ఆధికార బీఆర్‌ఎస్‌ను అంగ, అర్ధ బలాల్లో దీటుగా ఎదుర్కొనే ఎత్తుగడతో ఇతర పార్టీల నుంచి కొత్త నేతలను చేర్చుకుంటున్న హస్తం పార్టీ.. సీనియర్లతో సమన్వయం చేయలేక తల పట్టుకుంటోందని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నుంచి వలసలు ఎక్కువయ్యాయి. సమర్థులైన నాయకులను ఏరికోరి పార్టీలోకి తెచ్చుకోవడమే కాకుండా.. వారికి టిక్కెట్లు ఇస్తామని హామీలిస్తోంది పార్టీ నాయకత్వం. ఐతే స్థానికంగా సీనియర్లు, ఇతర క్యాడర్ కొత్తగా చేరిన వారికి సహకరించకపోవడంతో అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి వస్తోందని కొత్తగా చేరిన నేతలు మదనపడుతున్నారు.

కొత్తగా నేతలు చేరిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉండగా, ముఖ్యంగా గద్వాల, బాల్కొండ, కరీంనగర్లలో కాంగ్రెస్ రాజకీయం రోడ్డెక్కింది. గ‌ద్వాల్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి డీకే అరుణ ఫ్యామిలీ పార్టీని వీడటంతో కాంగ్రెస్ బ‌ల‌హీన‌మైంది. డీకే అరుణ రాజీనామా తర్వాత యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మ‌లిచేటి రాజీవ్‌రెడ్డి, (Malicheti Rajeev Reddy) డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాక‌ర్‌రెడ్డి పార్టీని న‌డిపించారు. ఐతే వచ్చే ఎన్నికల్లో సమర్థ నేత కోసం అన్వేషించిన కాంగ్రెస్ ఈ మధ్యనే జడ్పీ చైర్ప‌ర్సన్ స‌రితా తిరుప‌తయ్యను (Saritha Tirupathayya) పార్టీలోకి చేర్చుకుంది.

Also Read: ఈ విషయంపైనే సోనియాతో మాట్లాడాను.. చర్చలు కొలిక్కివచ్చాయి: వైఎస్ షర్మిల

టిక్కెట్ హామీతో కాంగ్రెస్‌లో చేరిన జడ్పీ చైర్‌పర్సన్‌కు కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ రాజకీయం తెలిసిపోయింది. తిర‌గ‌బ‌డ‌దాం-త‌రిమికొడ‌దాం అనే కార్యక్రమానికి సరితా తిరుపతయ్యను కో-ఆర్డినేట‌ర్‌గా నియ‌మిస్తే.. రాజీవ్‌రెడ్డి, ప్రభాక‌ర్‌రెడ్డితోపాటు మిగ‌తా నేత‌లు పార్టీపైనే తిర‌గ‌బ‌డ్డారు. గాంధీభ‌వ‌న్‌కు వ‌చ్చి హ‌ల్చ‌ల్ చేయ‌డంతో వీరిని కూడా కో-ఆర్డినేట‌ర్లుగా నియ‌మించారు. అంతేకాకుండా అలంపూర్ ప్రాంతానికి చెందిన జడ్పీ చైర్‌పర్సన్‌కు గద్వాల రాజకీయాలతో పనేమిటంటూ ‘వ‌ల‌స నేత‌ల పెత్తనాన్ని స‌హిద్దామా- గ‌ద్వాల ఆత్మగౌర‌వాన్ని చాటుదామా.. ఆధిప‌త్యం కోసం ఆరాటం మీది- ఆత్మగౌర‌వం కోసం పోరాటం మాది అంటూ ఫ్లెక్సీలు పెట్టి వీధి పోరాటానికి సిద్ధమయ్యారు కాంగ్రెస్ నేతలు.

Also Read: సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తా.. ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా : పొంగులేటి

ఇక బాల్కొండ‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ అధికార బీఆర్ఎస్‌ను గ‌ట్టిగా ఎదుర్కొవాలనే ఉద్దేశంతో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఈర‌వ‌త్రి అనిల్ (Anil Kumar Eravathri) ఈసారి నిజామాబాద్ అర్బన్‌పై ఫోకస్ పెట్టడంతో ఈ సీటుపై డీసీసీ అధ్యక్షుడు బానాల మోహ‌న్‌రెడ్డి, కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేశ్రెడ్డి కన్నేశారు. సునీల్‌రెడ్డి రాకతో తమకు టిక్కెట్ దక్కదనే ఆలోచనతో ఆయన వెంట ఎవరైనా తిరిగితే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు డీసీసీ అధ్యక్షుడు బానాల మోహ‌న్‌రెడ్డి.

ఇదేవిధంగా కరీంనగర్‌లో కూడా ఇటీవల పార్టీలో చేరిన కొత్తా జైపాల్‌రెడ్డికి (Kotha Jaipal Reddy) స్థానిక నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంపై సీనియర్ నేత ఎమ్మెస్సార్ మనవడు రోహిత్‌రావు ఆశలు పెట్టుకున్నారు. సడన్‌గా జైపాల్‌రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో పాత క్యాడర్‌కు మింగుడు పడటం లేదని చెబుతున్నారు. ఇలా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుండటంతో పీసీసీకి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. పార్టీ బలోపేతానికి కొత్త నేతలను చేర్చుకుంటే.. సీనియర్లు సర్దుకుపోవాలేగాని.. ఇలా చికాకులు సృష్టించడం ఏమటని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. మొత్తానికి కాంగ్రెస్ రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని ప్రస్తుత పరిస్థితులు మరోసారి రుజువు చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.