బారెడు పొడవున్న జుత్తును దానం చేసిన నృత్యకారిణి

బారెడు పొడవున్న జుత్తును దానం చేసిన నృత్యకారిణి

Updated On : February 21, 2021 / 7:10 AM IST

donation cancer patients : బారెడు పొడవున్న జుత్తును కూచిపూడి నృత్యకారిణి దానం చేసింది. నృత్యం చేస్తూ..తీసిన ఫొటో..ప్రస్తుతం గుండుతో కనబడుతున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జడను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ఆ జడ దానం చేయడానికి కారణం ఏంటీ ?

క్యాన్సర్ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో తల వెంట్రుకలు కోల్పోతుంటారనే సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది మానవత్వంతో చలించి…వారి జుట్టును దానం చేస్తుంటారు. మానసికంగా కృంగిపోయి బాధ పడుతున్న వారి పరిస్థితిని చూసి కూచిపూడి నృత్యకారిణి శ్రావ్య మానస భోగిరెడ్డి చలించిపోయింది. ఈమె హైదరబాద్ లోని మోతీనగర్ లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్ డీ చేస్తోంది. నృత్యకారిణిగానే కాకుండా..డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరొందింది.

బీటెక్, ఎంటెక్ చేసిన తర్వాత..మాస్టర్ ఇన్ ఫర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసిన శ్రావ్య..పలు ప్రదర్శనలకు వెళ్లేది. అయితే..రేడియేషన్ కారణంగా..జుత్తును కోల్పోయిన వారి పరిస్థితిని చూసి బాధ పడేది. ఈమెకు బారెడు జడ ఉండేది. ఏదైనా చేయాలని అనిపించింది. జుత్తును సేకరించే హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్ ను సంప్రదించింది. ఇటీవలే తన జుత్తును వారికి అందచేయడం జరిగిందని శ్రావ్య వెల్లడించింది. తన జడ .. మరొకరికి విగ్గులాగ ఉపయోగపడితే అంతకంటే ఆనందం తనకు ఇంకొకటి లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

కొద్ది రోజులు విగ్గుతో జడ వేసుకొని ప్రదర్శనలు ఇచ్చే అవకాశం తనకు ఉందని ఆమె తెలిపారు. క్యాన్సర్‌కు గురై కీమో థెరపీతో జుత్తు కోల్పోయిన వారికి వీరు దానం చేసిన జుత్తును విగ్గులాగ తయారు చేసి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఈ ఆర్గనైజేషన్‌కు తమ తల వెంట్రుకల్ని అందజేస్తుంటారు.