Superstitions: నిర్మల్ జిల్లాలో దారుణం.. పసుపు బియ్యం తిని 13 మంది విద్యార్థులకు అస్వస్థత.. అసలేం జరిగిందంటే..
సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Superstitions: నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. మూఢనమ్మకాలు పిల్లల ప్రాణాల మీదకు తెచ్చాయి. వేపాకు కలిపిన పసుపు బియ్యం తిని 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
అసలేం జరిగిందంటే.. ఓ బాలిక డబ్బులు పోయాయి. వాటి గురించి మిగతా బాలికలను అడిగింది. వారు తమకేమీ తెలియదని చెప్పారు. దీంతో ఆ బాలిక మూఢనమ్మకంతో తోటి బాలికలతో పసుపు బియ్యం, వేపాకు తినిపించింది. కాసేపటికే వారు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు, కడుపు నొప్పితో విలవిలలాడారు. వెంటనే వారిని పెంబిలోని ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
పసుపు బియ్యం తింటే అస్వస్థతకు గురవుతారు. దొంగతనం చేసిన వారే అలా అస్వస్థతకు గురవుతారనే మూఢ నమ్మకం ఉంది. ఇదే మూఢ నమ్మకంతో ఓ బాలిక.. మిగతా విద్యార్థులతో వేపాకు కలిపిన పసుపు బియ్యం తినిపించింది. దీంతో ఈ ఘోరం జరిగింది. తొలుత ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుకున్నారు. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
అక్కడ ఇంత జరిగినా తమకేమీ తెలియదని ఆశ్రమ సిబ్బంది చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. వారే పిల్లలతో పసుపు బియ్యం తినిపించి ఉంటారనే అనుమానాలూ ఉన్నాయి. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఎవరికీ సీరియస్ లేదని చెప్పారు. దీంతో వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతుండటం ఆందోళన కలిగించే అంశం. అర్థం లేని మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదకు తెస్తున్నారు.