Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. అలాచేయకుంటే జైలుకెళ్లాల్సిందే.. అధికారులకు సుప్రీంకోర్టు హెచ్చరిక
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

kancha gachibowli land
Supreme Court: హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా..? లేదా.? అనేది స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలను స్పష్టంగా చెపాలని ధర్మాసనం పేర్కొంది.
కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకెళ్లాల్సిందే. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీ పై చర్యలు ఉంటాయి. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు తొలగించారు. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి..? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర సాధికార సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరారు. తదుపరి విచారణను కోర్టు జులై 23కు వాయిదా వేసింది.