Hyderabad Minor: హైదరాబాద్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. తమిళిసై, పవన్ కల్యాణ్ ఆగ్రహం
ఈ ఘటనపై 48 గంటల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.

Pawan Kalyan, Tamilisai Soundararajan
Hyderabad Minor girl Case: హైదరాబాద్, మీర్‌పేట (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీలో కొందరు మృగాళ్లు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) స్పందించారు.
ఈ ఘటనపై 48 గంటల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమీషనర్ ను ఆదేశించారు. అలాగే, బాధితురాలి ఇంటిని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు సందర్శించి, ఆమె కుటుంబానికి సాయం అందించాలని చెప్పారు.
ఇలాంటి వార్తలు తరచూ వింటున్నాం
సామూహిక అత్యాచారం ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. ” అమ్మానాన్న లేని ఆ బాలిక తన తమ్ముడితో కలసి జీవిస్తుంటే నలుగురు మృగాళ్లు చేసిన అఘాయిత్యం మానవత్వానికి ఒక మచ్చ. బాధిత బాలిక తమ్ముణ్ణి బెదిరించి… గంజాయి మత్తులో తూగుతూ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలి.
సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాల్ని సంరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆ బాలిక, ఆమె సోదరుడు మనో ధైర్యంతో బతికే విధంగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నాను. విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గంజాయి ముఠాలు పెరుగుతున్నాయనే వార్తలు తరచూ వింటున్నాం. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో కూడా పత్రిక, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు చెబుతూనే ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ ముఠాలను అణచివేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి ఘాతుకాలకు అడ్డుకట్ట వేయగలం” అని పవన్ పేర్కొన్నారు.
Posani Krishna Murali : ఖబడ్దార్ లోకేశ్.. నారా లోకేశ్‌కు పోసాని కృష్ణమురళి స్ట్రాంగ్ వార్నింగ్