ఓ జీపీఎస్ ట్రాకర్.. 2వేల కాల్స్.. ఓ మర్డర్.. గద్వాల తేజేశ్వర్ కేసులో సంచలన విషయాలు..
కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సన్నిహిత సంబంధం పెళ్లయిన రెండురోజులకే భర్త తేజేశ్వర్ కు తెలియడంతో భార్య సహస్రను మందలించినట్లు తెలిసింది.

Tejeshwar murder case
Jogulamba Gadwal: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలోనే.. గద్వాల జిల్లాలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య జరగడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. పెళ్లి చేసుకున్న నెలరోజులకే భర్త తేజేశ్వర్‌ను భార్య హత్య చేయించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తేజేశ్వర్ భార్యతోపాటు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: తెలంగాణలో ‘మేఘాలయ హనీమూన్ మర్డర్’ తరహా ఘటన..? పెళ్లైన నెల రోజులకే భర్తను చంపేశారు..
ఓ బ్యాంక్‌కు అనుబంధంగాఉన్న CanFin Homes Ltd నందు తిరుమలరావు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తిరుమలరావు మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో ఐశ్వర్యపై మోజు పెంచుకున్నాడు. ఐశ్వర్యతో వివాహం చేసుకుని తన ఆస్తికి వంశాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచించాడు. మొదటగా తిరుమలరావు తన కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న సుజాత (ఐశ్వర్య తల్లి)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఐశ్వర్యకు దగ్గరయ్యాడు.
ఐశ్వర్యకు గద్వాల పట్టణం గంటవీధికి చెందిన తేజేశ్వర్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక అసలు కథ మొదలైంది. ఐశ్వర్యతో గతేడాది డిసెంబర్ 18న తేజేశ్వర్‌తో నిశ్చితార్ధం అయింది. అప్పటి నుంచి తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు ఐదుసార్లు రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. నిశ్చితార్ధం అయ్యాక పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో కొద్దిరోజులు తిరుమలరావుతో ఐశ్వర్య వెళ్లిపోయింది.
ఐదుసార్లు రెక్కీ ఫెయిల్ అవ్వడంతో తేజేశ్వర్ బైక్‌పై ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో సులువుగా తెలుసుకునేందుకు ఐశ్వర్య తేజేశ్వర్ ద్విచక్రవాహనానికి జీపీఎస్ అమర్చింది. నిశ్చితార్ధం అయిన నాటినుండి మూడు నెలల్లో తన ప్రేమికుడు తిరుమలరావుతో ఐశ్వర్య 2200 కాల్స్ మాట్లాడింది. అయితే, నిశ్చితార్ధం అయిన తేజేశ్వర్‌తో 120 కాల్స్ మాట్లాడినట్టు తేజేశ్వర్ కుటుంబ సభ్యులు తెలిపారు.
తేజేశ్వర్ ను హత్యకు ప్లాన్ లో భాగంగా.. కర్నూల్‌లో గోపి అనే వ్యక్తి నుండి నెలకు రూ.25వేలు చొప్పున అద్దె మాట్లాడుకొని షిఫ్ట్ డిజైర్ కారును 25 రోజుల కిందట తిరుమలరావు అద్దెకు తీసుకున్నాడు. కారులో తేజేశ్వర్‌ను తీసుకెళ్లేందుకు సులువుగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పెట్టుకున్నారు. బంధువుల పొలం హద్దులు చూయించాలని ఐశ్వర్య చెప్పడంతో.. ఈనెల 17న గద్వాల పట్టణం ఫాతిమ ఐటీఐ దగ్గర తన ద్విచక్ర వాహనాన్నిఆపి తేజేశ్వర్ కారులో వెళ్లిపోయాడు. కారులో వెళ్లి ఇటిక్యాల మండలం మొగలిరావుల చెరువు వద్ద పొలంచూసి వస్తుండగా.. కారులో ఉన్నవాళ్లు తేజేశ్వర్‌పై మూకుమ్మడి దాడి చేశారు. దాడి నుండి తప్పించుకునేందుకు తేజేశ్వర్ ప్రయత్నించగా.. వెనక నుండి గొంతుపై కత్తిపెట్టి గొంతుకోసేసినట్టు సమాచారం.
తేజేశ్వర్ చనిపోయాడని నిర్దారణకు వచ్చిన వెంటనే తిరుమలరావు, ఐశ్వర్యలకు సుపారీ గ్యాంగ్ సమాచారం ఇచ్చింది. తేజేశ్వర్ కనపడట్లేదని గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం తేజేశ్వర్ ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఐశ్వర్య సరైన సమాచారం చెప్పలేదు.
పోలీసుల అదుపులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, మరో ఇద్దరు ఉన్నట్టు తెలిసింది. తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు తిరుమలరావు డ్రైవర్ నగేష్‌తో సుపారీ మాట్లాడినట్టు కీలక సమాచారం. హత్యలో కీలక సూత్రదారి తిరుమలరావు దొరకకపోవడంతో పోలీసులు నిజానిజాలపై నిర్దారణకు రాలేకపోతున్నారు. ప్రధాన నిందితుడు తిరుమలరావు లాస్ట్ లొకేషన్ హైదరాబాద్ వస్తుండటంతో రెండు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.