తెలంగాణలో ‘మేఘాలయ హనీమూన్ మర్డర్’ తరహా ఘటన..? పెళ్లైన నెల రోజులకే భర్తను చంపేశారు..
పెండ్లి జరిగిన రోజునుంచి ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో భర్త మందలించాడు. దీంతో రెండోరోజు నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

Telangana: మేఘాలయ హనీమూన్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన తెలంగాణ రాష్ట్రంలోనూ జరిగింది. పెండ్లి జరిగిన నెలరోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్యచేయించిన ఘటన గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు భార్య, ఆమె తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జోగుళాంబగద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ (32) ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఐదురోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. అయితే, ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగొచ్చిన ఐశ్వర్య.. తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకెంతో ఇష్టం అంటూ విలపించింది. ఐశ్వర్య చెప్పిన మాటలు నమ్మిన తేజేశ్వర్ పెళ్లికి అంగీకరించాడు. వారి తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. దీంతో మే 18న తేజేశ్వర్, ఐశ్వర్య వివాహం జరిగింది.
Also Read: DRI Mumbai: వామ్మో.. ఆ వ్యక్తి కడుపులో కిలో కొకైన్ క్యాప్సుల్స్.. దాని విలువ 11 కోట్లు..
పెండ్లి జరిగిన నాటినుంచి ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండటంతో తేజేశ్వర్ మందలించాడు. దీంతో రెండోరోజు నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అయితే, జూన్17న తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఏపీలోని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్ట జమ్ములో తేజేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు. పెండ్లి తరువాత ఐశ్వర్య 2వేల సార్లు బ్యాంకు ఉద్యోగితో మాట్లాడినట్లు గుర్తించారు. దీంతో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకొని విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తుంది. అదే బ్యాంకుకు చెందిన ఓ ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్దిరోజుల తరువాత ఆ బ్యాంకు ఉద్యోగి ఐశ్వర్యతోకూడా సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. అయితే, తేజేశ్వర్ ను పెండ్లి చేసుకొని ఆ తరువాత అతన్ని చంపేసి ఆస్తిని సొంతం చేసుకోవాలని వారు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్లాన్ లో భాగంగానే తేజేశ్వర్ ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చినట్లు, వారు పొలం సర్వే పేరుతో తేజేశ్వర్ ను తీసుకెళ్లి కత్తులతో పొడి చంపేసినట్లు తెలిసింది. ఈ హత్యకు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత సహకరించారని సమాచారం. బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇంకా ఈకేసుపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. దర్యాప్తు పూర్తయిన తరువాత మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.