Telangana Covid Report
Telangana Covid Bulletin : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 569 కరోనా పరీక్షలు నిర్వహించగా 35 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 21 కేసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5, హన్మకొండ జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, ఖమ్మం జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1, యాదాద్రి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
అదే సమయంలో మరో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా మరణాలేవీ సంభవించ లేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,86,023 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 657 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 20వేల 496 కరోనా పరీక్షలు నిర్వహించగా, 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొన్ని రోజులుగా 3 వేల దిగువనే నమోదువుతున్న కొత్త కేసులు.. తాజాగా 1700కు దిగిరావడం మరింత ఊరట కలిగిస్తోంది. అయితే మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,31,973 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,761 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజు 71 మరణాలు నమోదు కాగా.. నిన్న 127 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 5,16,479కి చేరింది.
నిన్న మరో 3వేల 196 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటి ఆ రేటు 98.74 శాతానికి పెరిగింది. రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 26వేల 240(0.06%) యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. నిన్న 15,34,444 మంది టీకాలు వేయించుకోగా.. నేటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 181 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
అయితే, కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. వైరస్ తీవ్రత కాస్త తగ్గింది అంతే. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉప్పెనలా విజృంభించవచ్చు అంటున్నారు. వాస్తవానికి కరోనా నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.
రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియంట్ బయటపడటం, చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా తీవ్రత పెరగడం.. లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి రావడం బెంబేలెత్తిస్తోంది.
కరోనా కారణంగా పరిస్థితులు మళ్లీ దారుణంగా మారిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కేసులు తగ్గాయని సామాజిక దూరం, మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నారంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో కరోనా విజృంభణను ప్రస్తావిస్తూ దేశంలో పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ వంటివి తప్పనిసరిగా
పాటించాలని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.20.03.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/UFEprDOVs4— IPRDepartment (@IPRTelangana) March 20, 2022