Chennur Politics : చెన్నూరులో ముక్కోణపు పోరు.. గెలిచేదెవరు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అదే స్థాయిలో విమర్శలు జిల్లాను హీటెక్కుస్తున్నాయి. అభివృద్ధి మేం చేశామంటే మేమే చేశామంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.

Chennur
Chennur Constituency Politics : రాజకీయ కురుక్షేత్రంలో ఎత్తుకు పైఎత్తులు.. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పై చేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు, డిసెంబర్ 3న విజయఢంకా మోగిస్తామన్న సవాళ్లు.. వీటన్నింటితో రంజుగా మారిన రాజకీయం.. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు “నీకు నాకు సై” అంటున్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచార హోరు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. అదే స్థాయిలో విమర్శలు జిల్లాను హీటెక్కుస్తున్నాయి. అభివృద్ధి మేం చేశామంటే మేమే చేశామంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. మీవి సూటు కేసు రాజకీయాలంటూ రెండు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు చెన్నూరు అభివృద్ధిని అటకెక్కించారంటూ బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరి ఈ ట్రయాంగిల్ పోరులో చెన్నూరు ప్రజలు ఎవరికి పట్టం కడతారు.. ఎవరిని పక్కన పెడతారు.
Rangareddy District: హైదరాబాద్‌ను పట్టాలంటే రంగారెడ్డిని కొట్టాలి.. కారు, హస్తం పందెంలో విజేత ఎవరు?
ఎన్ని కుట్రలు చేసినా నాకు హ్యాట్రిక్ విక్టరీ ఖాయం : బాల్క సుమన్
చెన్నూరులో వేల కోట్ల అభివృద్ధికి, వేల కోట్లు ఉన్న వివేక్ మధ్య పోటీ జరుగుతుందని బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. ఎన్నికల సమయంలో సూట్ కేసులతో వచ్చే నేతల్ని ప్రజలు నమ్మరని బాల్క సుమన్ అంటున్నారు. సూటు కేసు కంపెనీలతో కోట్లు పంచేందుకు కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా.. చెన్నూరులో తనకు హ్యాట్రిక్ విక్టరీ ఖాయమని బాల్క సుమన్ అంటున్నారు.
బాల్క సుమన్ ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు : వివేక్ వెంకటస్వామి
చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగడాలతో ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. చెన్నూరులో భూ మాఫియా, ఇసుక మాఫియా నడిపించిన బాల్క సుమన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి తప్పా.. బీఆర్‌ఎస్ ఏం చేసిందని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ప్రశ్నించారు.
Goshamahal Politics : ఇంతవరకు గులాబీ జెండా ఎగరని గోశామహల్‌లో ఈసారి విజేత ఎవరు?
చెన్నూరులో గెలిచేది కమలమే : అశోక్
ఇద్దరు హేమహేమీలు బరిలో ఉన్నా.. విజయం తనదేనని బీజేపీ అభ్యర్థి దుర్గం అశోక్ అంటున్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయంటున్నారు. పొలిటికల్ టూరిస్టుల్లా వచ్చే నేతల్ని ప్రజల నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయాల్లో పట్టించుకోని నేతలు ఇప్పుడు ఓట్ల కోసం తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఎన్ని కోట్లు కుమ్మరించినా.. ఎన్ని మాయ మాటలు చెప్పినా.. చెన్నూరులో గెలిచేది కమలమే అని ఆ పార్టీ అభ్యర్థి దుర్గం అశోక్ అంటున్నారు.
ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది?
ఓ వైపు హీటెక్కించే విమర్శలు.. మరోవైపే హోరెత్తించేలా ప్రచారాలు.. ట్రయాంగిల్ పోటీలో ఎవరికి వారే ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారు “నీకు నాకు సై” అంటున్నారు. మరి చెన్నూరులో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో వేచి చూడాల్సిందే.