Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
రాష్ట్రంలో కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయాలని నిర్ణయం.

Ponguleti Srinivas Reddy
Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించినట్లు సమాచారం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ”ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.
Also Read : రేవంత్ భారీ స్కెచ్.. జానారెడ్డికి కీలక పదవి? రేవంత్‌కు జానారెడ్డి బలం కాబోతున్నారా ?
7 మండలాలు 54 గ్రామాల్లో ఎఫ్‌డీసీఏగా నిర్ణయించాం. నాగార్జునసాగర్- శ్రీశైలం రహదారి మధ్య ప్రాంతం ఫ్యూచర్ సిటీ. హెచ్‌ఎండీఏను భారీగా విస్తరించాలని నిర్ణయించాం. 11 జిల్లాలు 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్‌ఎండీఏ విస్తరణ. దీని పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తాం.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయాలని నిర్ణయం. మహిళా సంఘాలన్నింటినీ ఒకే గొడుకు కిందికి తేవాలని నిర్ణయించాం. మహిళా సంఘాల సభ్యత్వానికి వయో పరిమితిని 15 నుంచి 65 ఏళ్లుగా నిర్ణయించాం. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’’ అని మంత్రి పొంగులేటి వివరించారు.