Telangana Congress : కాంగ్రెస్‌లో కొత్త రోగం మొదలైంది : దామోదర సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ లో కొత్త రోగం మొదలైంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్శింహ సంచలన వ్యాఖ్యలు చేశారు.

damodar raja narasimha shocking comments
Telangana Congress : కాంగ్రెస్ లో కొత్త రోగం మొదలైంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్శింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన దామోదర కాంగ్రెస్ లో గత 8 ఏళ్ల నుంచి కొత్త రోగం మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో బలహీన వర్గాలకు గుర్తింపులేదని అసలైన కాంగ్రెస్ నేతలకు ఎటువంటి గుర్తింపు దక్కటంలేకపోగా అన్యాయం జరుగుతోంది అంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. మూడు నెలల క్రితం పార్టీలోకి వచ్చినవాళ్లకు కూడా కమిటీలో చోటిచ్చారని అన్నారు. కోవర్టుకు గుర్తింపు ఉంటోంది గానీ పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి ఎటువంటి గుర్తింపు లేదన్నారు. కోవర్టులుగా ఉండి పార్టీకి ద్రోహం చేసేవారికే పదవులు దక్కుతున్నాయన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ వంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని..ఎటువంటి క్లిష్టపరిస్థితులు వచ్చినా పార్టీనే అంటిపెట్టుకుని కష్టపడిపనిచేసేవారికి న్యాయం జరగటంలేదన్నారు. అయినా హైకమాండ్‌ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదు కదా అంటూ ఆవేదన వ్యక్తంచేశారు దామోదర.
పార్టీలో కోవర్టులను సమయం వచ్చినపుడు ఆ పేర్లు బయట పెడతా..
పార్టీ పదవుల విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు అన్యాయం జరిగిందని.. జిల్లాల వారీగా పార్టీ నాయకుల పనితీరును అంచనా వేసిన దాఖలాలు లేవని అన్నారు. పార్టీలో తలెత్తే విభేదాలను పరిష్కరించటానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా జరిగింది. కోవర్టులు ఉండటం వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. కోవర్టులని తెలిపే ఆధారాలు ఉన్నాయని వారి పేర్లను సమయం వచ్చినప్పుడు బయటపెడతాని అన్నారు. పార్టీలో కొత్తగా చేరినవారికి పదవులు ఇవ్వొద్దని మేం అనడం లేదు. ఇచ్చేవాళ్లకి అర్హత ఉందో లేదో తెలుసుకుని ఇవ్వాలని లేదంటే పార్టీకి నష్టం వస్తుందని అన్నారు.
పార్టీలో ప్రక్షాళన జరగాలి లేదంటే నష్టం తప్పదన్నారు. కాంగ్రెస్ మాకు మాతృ పార్టీ… దాన్ని కాపాడుకోవాలనే ఆశతోనే మేం పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. పదవులు ఉన్నా లేకున్నా ఆత్మగౌరవంతో బతుకుతాం…కానీ మా అందరిదీ ఒకటే విజ్ఞప్తి ఒక్కటే.. కమిటీల ఏర్పాటులో జరిగిన తప్పులను సవరించాలి. కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగాలి. లేకపోతే భవిష్యత్‌లో నష్టపోవాల్సి వస్తుందని వెల్లడించారు దామోదర రాజనర్శింహ.