వాహనదారులకు బిగ్ అలెర్ట్.. మీకు ట్రాఫిక్ చలాన్ కట్టమని మెసేజ్ వచ్చిందా..!

ట్రాఫిక్ చలాన్ పేరుతో మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయా..? అయితే, జాగ్రత్త..! తొందరపడి ఆ మెస్సేజ్‌లను ఓపెన్ చేయకండి.. ఎందుకంటే..

వాహనదారులకు బిగ్ అలెర్ట్.. మీకు ట్రాఫిక్ చలాన్ కట్టమని మెసేజ్ వచ్చిందా..!

traffic challan

Updated On : July 20, 2025 / 10:24 AM IST

Traffic Challan: ట్రాఫిక్ చలాన్ పేరుతో మీకు మెస్సేజ్‌లు వస్తున్నాయా..? అయితే, జాగ్రత్త..! తొందరపడి ఆ మెస్సేజ్‌లను ఓపెన్ చేయకండి.. ఎందుకంటే.. ట్రాఫిక్ చలాన్ పేరిట సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. “RTO Traffic Challan.apk2” పేరుతో వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఏపీకే ఫైల్స్ ను పంపిస్తున్నారు. ఇటువంటి లింక్ లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఒకవేళ చేశారంటే.. ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లి, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయల్ ప్రజలకు హెచ్చరికలు చేశారు. వాట్సాప్ లో వచ్చే ఏపీకే ఫైల్స్ పై క్లిక్ చేయొద్దంటూ సూచించారు.

సాయంత్రం సమయాల్లోనే ఎక్కువగా..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం గమనించిన వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ గ్రూపుల ద్వారా “RTO Traffic Challan.apk” అనే ప్రమాదకరమైన లింక్ ను సాయంత్రం సమయాల్లోనే ఎక్కువగా పంపుతున్నారు. ముందుగా ఏపీకే ఫైల్ ను పంపుతారు. నమ్మదగిన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారు. ఆ గ్రూపులో ఉన్న సభ్యులు ఏపీకే ఫైల్‌ను క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే.. ఫోన్ రిమోట్‌గా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది. ఆ తరువాత ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు చోరీకి గురవుతుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. అంతేకాదు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్‌లు కూడా రాకుండా సైబర్ నేరగాళ్లు చేస్తారు. గుర్తుతెలియని వాట్సాప్ నెంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయొద్దు.. యాప్‌లను గూగుల్ ప్లే‌స్టోర్ నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు.

ఇలా ఫిర్యాదు చేయండి..
సైబర్ నేరాల పట్ల ఫిర్యాదు చేయడానికి 1930 టోల్‌ఫ్రీ నంబర్ కు లేదా 8712672222 వాట్సాప్ నవంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు శిఖా గోయల్ సూచించారు. లేదంటే www.cybercrime.gov.in ద్వారా తెలపాలని సూచించారు. అయితే, సైబర్ నేరగాళ్ల బారినపడిన సమయంలో గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయడం వల్ల మీ డబ్బును సురక్షితంగా కాపాడుకోవచ్చునని ఆమె వెల్లడించారు.

ఈ సూచనలు తప్పక పాటించాలి..
♦ గుర్తు తెలియని లేదా అనధికారిక లింకులపై క్లిక్ చేయకండి. ఏపీకేలు డౌన్ లోడ్ చేయకండి.
♦ వాట్సాప్ గ్రూపుల పేర్లను గుడ్డిగా నమ్మకండి. నేరగాళ్లు వాటిని అధికారికంగా కనిపించేటట్లు పేరు పెడతారు.
♦ యాప్స్ ఎప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఇన్ స్టాల్ చేయండి.
♦ ఓటీపీ అలర్ట్స్ ఎనేబుల్ చేసుకోండి. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే కార్డు బ్లాక్ చేయండి.