Telangana DGP: ఆ ఫొటోపై తెలంగాణ డీజీపీ ఫైర్.. ఇంతకీ ఏంటా ఫొటో!?

న్యూస్ పేపర్ లో వచ్చిన ఓ ఫొటోపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఘాటుగా స్పందించారు. ఇంతకీ ఏంటా ఫొటో!?

Telangana DGP: ఆ ఫొటోపై తెలంగాణ డీజీపీ ఫైర్.. ఇంతకీ ఏంటా ఫొటో!?

Telangana DGP Anjani Kumar

Telangana DGP Anjani Kumar: తల్లిదండ్రులు (Parents) ఇంత బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఇంతకీ ఆయన ఏ విషయంలో ఇలా స్పందించారనేగా మీ డౌటు? న్యూస్ పేపర్ (News Paper) లో వచ్చిన ఓ ఫొటోపై ఆయన ఈవిధంగా రెస్పాండ్ అయ్యారు. దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ ను ట్విటర్ (Twitter) లో షేర్ చేసి తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇంతకీ ఏంటా ఫొటో?
ఇద్దరు చిన్నారులు తెరచివున్న కారు డిక్కీలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఫొటో అది. చిన్నారులిద్దరూ డిక్కీలో కూర్చుని ఉండగా కారు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. రసూల్ పూరాలో ఆదివారం కంటపడిన ఈ దృశ్యాన్ని ‘కిడ్స్ ఇన్ రిస్కీ బూట్ రైడ్’ పేరుతో ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. దీనిపై డీజీపీ అంజనీ కుమార్ ఘాటుగా స్పందించారు.

తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని గర్హిస్తూ.. ఈ అమాయక పిల్లలకు భద్రత, క్రమశిక్షణ గురించి బోధించేది ఇదేనా అని ప్రశ్నించారు. పిల్లలకు మొదటి విద్యా పాఠాలు ఇంట్లోనే ప్రారంభమవుతాయని గుర్తు చేశారు. కొంతమంది తల్లిదండ్రులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీ పిల్లలకు మంచి విలువలను అందించాలని గట్టిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

మరిన్ని ఫొటోలు షేర్ చేసిన నెటిజనులు
డీజీపీ అంజనీ కుమార్ కమెంట్స్ పై నెటిజనులు రకరకాలుగా స్పందించారు. పిల్లలను ప్రమాదకర పరిస్థితులోకి నెట్టినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి వారు దారికి వస్తారని కొంతమంది అభిప్రాయపడ్డారు. పిల్లలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఫొటోలను మరికొందరు షేర్ చేశారు. పిల్లలను కార్లలో ఇలా తీసుకెళ్లడం కొంతమంది తల్లిదండ్రులకు ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. ద్విచక్ర వాహనాలపైన కూడా పిల్లలను ప్రమాదకరంగా తీసుకెళుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, పోలీసు వాహనాలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని కొంతమంది డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు.