TS EAMCET 2020 : ఏర్పాట్లు పూర్తి, ఆ సర్టిఫికేట్ తప్పనిసరి

  • Published By: madhu ,Published On : September 6, 2020 / 08:28 AM IST
TS EAMCET 2020 : ఏర్పాట్లు పూర్తి, ఆ సర్టిఫికేట్ తప్పనిసరి

Updated On : September 6, 2020 / 8:42 AM IST

EAMCET ఎగ్జామ్ ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఎంసెట్‌ కమిటీ రెడీ అవుతోంది. 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఎంసెట్‌ కమిటీ ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ పరీక్ష నిర్వాహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్‌లో 23 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పరీక్షను నాలుగు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షల నిర్వహణ షెడ్యూలు ఖరారు చేసింది.

ఇక థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా కరోనా లక్షణాలు లేని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టింది. కరోనా సంబంధ లక్షణాలున్న వారిని వెనక్కి పంపించి వేయాలని భావిస్తోంది. లేదా ఆ సెషన్‌లో ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. పరీక్ష కేంద్రంలో ఉన్న వసతులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థులు మాస్క్‌లు తెచ్చుకోవాలని, వాటిని ధరించాలని, 50ML శానిటైజర్‌ బాటిల్‌తోపాటు వాటర్‌ బాటిల్‌ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది.

అంతేకాదు పరీక్ష సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారంపై కాలేజీ ప్రిన్సిపాల్‌ సంతకం చేయించి, విద్యార్థులు తమ ఎడమచేతి వేలిముద్ర వేసి ఇన్విజిలేటర్‌కు అందజేయాలని నిబంధనల్లో పేర్కొంది. దానిని అందజేయకపోతే ఆ విద్యార్థి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతామని వెల్లడించింది. రఫ్‌ వర్క్‌ కోసం వినియోగించిన బుక్‌లెట్‌ను ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇచ్చివేయాలని పేర్కొంది.