Ration Card: రేషన్ కార్డు కోసం అప్లయ్ చేశారా..? మీకు బిగ్ అప్డేట్.. 10 రోజుల్లో..
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా ప్రకటించడంతోపాటు.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవటం కూడా..

New Ration cards
Ration Card: కొత్త రేషన్ కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లోలేని జిల్లాల్లో మొదట రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అయితే, రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డుల అర్హుల జాబితా ప్రకటించడంతోపాటు.. మీ సేవాల్లో దరఖాస్తు చేసుకోవటం కూడా జరిగిపోతుంది. కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం కొంతకాలంగా రేషన్ కార్డు దరఖాస్తులు, స్వీకరణ, అర్హుల ఎంపికపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఆ గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వం తెరదించింది.
నగరంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి, కొత్త కార్డులు జారీ చేసే బాధ్యతను ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకే అప్పగించింది. ఇప్పటి వరకు ప్రజాపాలన, మీ సేవలో దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్లను పరిశీలించి వార్డు సభల్లో అర్హుల జాబితా చదివి వినిపిస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. ఫిబ్రవరి రెండోవారంలోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావటంతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకంకు సంబంధించి అర్హుల జాబితాను మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి ప్రకటించాలని అధికారులు భావించారు. అయితే, అధికారుల నిర్ణయంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అర్హుల జాబితాలో మన పేరు ఉందో లేదో తెలియకపోవటంతో మళ్లీ మీ సేవలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో వార్డు సభలతో సంబంధం లేకుండా రేషన్ కార్డుల జారీ బాధ్యతను పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వచ్చే పదిరోజుల పాటు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు ఎన్నివచ్చాయో చూసుకొని స్క్రూటినీ చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. మొత్త జాబితాలో అర్హులను గుర్తించి వారి ఇండ్లకు వెళ్తామని, వారు ఇచ్చిన సమాచారం సక్రమంగానే ఉందని తెలిస్తే కార్డు జారీ చేస్తామని చెబుతున్నారు. అయితే, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులందరికీ కార్డులు పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన ద్వారా 5.40లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీనికితోడు గత నాలుగు రోజులుగా మీసేవ కేంద్రాల ద్వారా తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 85వేల దరఖాస్తులు వచ్చినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో పదిరోజుల్లో లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. అయితే, గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను ప్రకటించకపోవటంతో చాలా మంది మీసేవా కేంద్రాల్లోనూ మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారని, స్ర్కూటినీ తరువాత సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.