Telangana Govt: మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. ఇక నుంచి 15 నుంచి 65ఏళ్ల మహిళల వరకు ..
ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి తగ్గట్టు ..

Indira Mahila Shakti scheme
Indira Mahila Shakti scheme: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం అయింది. సుమారు ఆరు గంటలపాటు జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్ సెక్టార్లుగా విభజించిన ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ బఫర్ వరకు హెచ్ఎండీఏ ప్రాంతం పరిధిని విస్తరించింది. దాదాపు 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. వీటితోపాటు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యానికి తగ్గట్టు కొత్త పాలసీని రూపొందించింది ప్రభుత్వం. స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్ ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మహిళా శక్తి సంఘాలను ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు.
ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం, మహిళా సంఘాల గ్రూప్ లలో చేరే కనీస వయస్సును 18 నుంచి 15ఏళ్లకు తగ్గించారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక నుంచి 15 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలు కూడా సంఘాల్లో కొనసాగొచ్చు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో రక్షణశాఖకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి వారికి ప్రోత్సాహం అందిస్తామని ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మహిళా సదస్సులో ఇందిరా మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉంటే.. ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా రేవంత్ సర్కార్ కొత్త పథకాలు ప్రారంభిస్తుంది. నారాయణపేట జిల్లాలో మహిళలే పెట్రోలు బంకులను నిర్వహించేలా ఇప్పటికే స్కీం తీసుకురాగా.. మిగతా జిల్లాల్లోనూ మహిళలకు పెట్రోల్ బంకులు అప్పగించేందుకు సర్కార్ చమురు సంస్థలతో ఒప్పందం చేసుకోనుంది. మహిళా సంఘాల కోసం ఆర్టీసీ అద్దె బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తొలి విడతలో 50 బస్సులకు పచ్చజెండా ఊపనున్నారు.