Telangana Govt : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్న్యూస్.. అవన్నీ ఇక మీ ఇంటికే..
Telangana Govt : వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
driving licence
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్
- ఇంటికే లైసెన్స్లు, ఆర్సీలు
- ఇక నుంచి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ పద్ధతి
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు తీపికబురు చెప్పింది. ఇక నుంచి లైసెన్సులు, ఆర్సీలకోసం ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పనిలేదు. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఇంటికే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని 61 ఆర్టీవో కార్యాలయాల నుంచి ఈ కార్డుల్ని వాహనదారులకు పంపిస్తున్నారు. ఇక నుంచి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానానికి ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆయా ఆర్టీవో కార్యాలయాల పరిధి నుంచే ఆర్సీలు, లైసెన్సులు ప్రింట్ అయ్యాక డిస్పాచ్ అవుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఇక్కడ ముద్రణ ఆలస్యమవుతోంది. సెంట్రలైజ్డ్ విధానం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి లైసెన్సులు, ఆర్సీలు జారీ అవుతాయి.
రాష్ట్రంలో సగటున సంవత్సరానికి దాదాపు 4.70 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతున్నాయి. సుమారు 9.90 లక్షల వాహనాలు రిజిస్టర్ అవుతాయి. ఈ రెండూ కలిపి ఏడాదికి 14-15 లక్షల కార్డులను వాహనదారులకు అందించాలి. వీటి బట్వాడాకు వారాలు, నెలల సమయం పడుతోంది. గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో వందల కొద్దీ లైసెన్సులు, ఆర్సీలు అనేకమంది ఏజెంట్ల వద్ద లభ్యమవడం గమనా ర్హం. మరోవైపు కార్డులు లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ తనిఖీలతో వాహనదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ల వద్దకు కార్డులు వెళ్లనీయకుండా నేరుగా వాహనదారుడి ఇంటికే పంపేలా ఏర్పాట్లు చేశారు.
రవాణా శాఖకు వివిధ రకాల పన్నులు, ఫీజులతో ప్రతీయేటా రూ. 6,700 కోట్ల నుంచి రూ.6,900 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో సుమారు రూ.135 కోట్లకు పైగా యూజర్ ఛార్జీలు ఉంటాయి. ఈ సొమ్ము రవాణా శాఖకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది.
