Vasavi Jayanthi : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్ర పండుగల జాబితాలో మరో ఉత్సవం.. ఏప్రిల్ 26న అధికారికంగా
Vasavi Jayanthi : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పండుగల జాబితాలో మరో ఉత్సవాన్ని చేర్చింది. ఆ వివరాలు..
telangana govt declares vasavi matha jayanthi as annual state function official orders released
Vasavi Jayanthi : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సాధారణ పరిపాలన శాఖ అధికారిక జీవో విడుదల చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి ఏటా ‘వైశాఖ శుక్ల పక్ష దశమి’ రోజున వాసవీ మాత జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం వాసవీ మాత జయంతి ఏప్రిల్ 26వ తేదీన వస్తుంది. కనుక ఈ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి యువజన సర్వీసులు, పర్యాటక సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాల కోసం అయ్యే ఖర్చును సంబంధిత శాఖ బడ్జెట్ నుంచే కేటాయించనున్నారు.
వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఈ నెల 26న తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాసవి దేవాలయాలు, ఆర్యవైశ్య సత్రాలలో వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో అత్యంత వైభవంగా జరగనున్నాయి.
