Life Tax: వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త.. రెండో వాహనం కొనుగోలుపై ఆ ట్యాక్స్ రద్దు
ఈ కొత్త వ్యవస్థ ద్వారా వాహన యజమానులు ఇకపై అనేక సేవలను ఆన్లైన్లోనే సులభంగా పొందొచ్చు. అడ్రస్ మార్పు, డూప్లికేట్ ఆర్సీ, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మార్పులు వంటి సేవల కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.
- వాహనదారులపై అదనపు భారం తగ్గించిన ప్రభుత్వం
- రెండో వాహనం కొనుగోలుపై 2శాతం లైఫ్ ట్యాక్స్ రద్దు
- వాహన్ పోర్టల్ రాకతో సేవలు మరింత సులభతరం
Life Tax: వాహనదారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. సొంతంగా వాహనం ఉండి రెండో వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వారిపై అదనపు భారాన్ని తగ్గించింది. ఇప్పటివరకు రెండో వాహనం కొనుగోలుపై ప్రభుత్వం అదనంగా 2 శాతం లైఫ్ ట్యాక్స్ ను (జీవితకాలపు పన్ను) విధిస్తోంది. అయితే, ఇకపై ఆ ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేయాలని రవాణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో రెండో వాహనం కొనుగోలు చేయాలనుకునే వారిపై అదనపు భారం తగ్గినట్లైంది.
రాష్ట్ర రవాణ శాఖలో కీలక మార్పు జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన వాహన్ (Vahan) పోర్టల్ ను తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి వాహన్ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఇకపై రాష్ట్రంలోని వాహనాల డేటా బేస్ జాతీయ స్థాయి నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతుంది. ఈ పోర్టల్ పనితీరు ప్రకారం ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని వాహనాలు ఉన్నాయనే దాంతో సంబంధం లేకుండా అదనపు పన్ను సాఫ్ట్‌వేర్‌లో జనరేట్ కాదు. దీని వల్ల సాంకేతికంగా రెండో వాహనంపై వేసే ఎక్స్ట్రా ట్యాక్స్ ఆగిపోనుంది.
‘వాహన్’ పోర్టల్‌లో చేరితే కలిగే ప్రయోజనాలు..
ఈ కొత్త వ్యవస్థ ద్వారా వాహన యజమానులు ఇకపై అనేక సేవలను ఆన్లైన్లోనే సులభంగా పొందొచ్చు. అడ్రస్ మార్పు, డూప్లికేట్ ఆర్సీ, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మార్పులు వంటి సేవల కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. ఇంట్లో నుంచే నేరుగా ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు.
మోసాలకు చెక్..
సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ పోర్ట్ బాగా యూజ్ అవుతుంది. ఆ వాహనం పూర్తి చరిత్ర, పెండింగ్ చలాన్లు, ఇంజిన్ ఛాసిస్ నెంబర్లు వంటి వివరాలను సులభంగా ఆన్ లైన్ లోనే సరి చూసుకోవచ్చు. దీంతో వాహన కొనుగోలులో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. ముఖ్యంగా దొంగ వాహనాల అమ్మకాలు, కొనుగోళ్లకు చెక్ పడుతుంది. ఇక రోడ్ ట్యాక్స్ చెల్లింపులు, ఈ-చలానాల ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది.
డాక్యుమెంటేషన్ ప్రక్రియ మరింత సులభం..
వాహన్ పోర్టల్ ద్వారా వాహనదారులు తమ వాహన వివరాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఈజీగా తెలుసుకోవచ్చు. డిజిటల్ డాక్యుమెంట్లను ఈ యాప్‌లో భద్రపరుచుకోవచ్చు. ఇక రాష్ట్రానికి చెందిన వాహనాల వివరాలన్నీ నేషనల్ సర్వర్‌తో అనుసంధానం కావడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వాహన తనిఖీలు జరిగినప్పుడు లేదా వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ సులభం అవుతుంది.
మొత్తంగా రెండో వాహనం కొనుగోలుపై అదనపు ట్యాక్స్ రద్దుతో వాహనదారులకు ఆర్థిక ఉపశమనం కలగనుంది. ఇక వాహన్ పోర్టల్ రాకతో సేవలు మరింత సులభతరం కానున్నాయి.
Also Read: గ్యాస్ టెన్షన్‌కు చెక్.. దేశంలోనే ఫస్ట్ LPG ఏటీఎం.. జస్ట్ 2 నిమిషాల్లోనే సిలిండర్ ఇంటికి..!
