Telangana Govt : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. విద్యుత్ శాఖలో 3వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..?
Telangana Govt : ప్రస్తుతం నాలుగు విద్యుత్ సంస్థల్లో 934 ఖాళీలున్నాయి. వాటితోపాటు మొత్తం మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ ..

Telangana Electricity Department
Telangana Electricity Department : తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను చెప్పింది. విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, జెన్‌కో సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంబంధం లేకుండా ఆయా సంస్థల నుంచి వేరువేరుగా జాబ్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.. అయితే, ప్రస్తుతం విద్యార్థుల ప్రయోజనార్థం కామన్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం మూడు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: Singareni Workers: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. బోనస్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎంతంటే? ఏకంగా..
ప్రస్తుతం నాలుగు విద్యుత్ సంస్థల్లో 934 ఖాళీలున్నాయి. ఉత్తర తెలంగాణ డిస్కం(టీజీఎన్పీడీసీఎల్)లో 394, జెన్‌కోలో 283, దక్షిణ తెలంగాణ డిస్కం (టీజీఎస్పీడీసీఎల్)లో 135, ట్రాన్స్‌కోలో 122 పోస్టులు ఉన్నాయి. ఇవే కాకుండా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం చివరి దశకు వస్తుండటం, రామగుండంలో థర్మల్, ఇతర ప్రాంతాల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణ ప్రతిపాదనలు ఉండటంతో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యుత్ శాఖను ఉద్యోగ ఖాళీలు తీవ్రంగా వేధిస్తున్నాయి. కొన్నేళ్లుగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలను చేపట్టడం లేదు. ముఖ్యంగా వానాకాలంలో సరిపడా సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాలుగు విద్యుత్ సంస్థల్లో 934 ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. అన్ని స్థాయిల కలిపితే మొత్తంగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పరిధిలో దాదాపు 3వేలకుపైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్సీడీసీఎల్, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్ కో సంస్థల్లో వేరువేరుగా నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలకు దరఖాస్తు చేసి రాస్తున్నారు. కొందరికి రెండు, మూడు సంస్థల్లో ఏకకాలంలో ఉద్యోగాలు వస్తుండగా.. ఏదో ఒక దానిలో చేరుతున్నారు. దీని వల్ల మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై నాలుగు సంస్థల్లో ఖాళీలకు సంబంధించి ఒకటే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు సంస్థల్లో ఒకే సారి నోటిఫికేషన్ జారీ చేసి.. పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించాలని నిర్ణయించింది.