Telangana Govt: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు ప్రోత్సహించేలా.. రేవంత్ సర్కార్ సరికొత్త పథకం..
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.

Government Hospitals: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలో కేసీఆర్ కిట్ లో ఇచ్చిన కొన్ని వస్తువులతో పాటు మరికొన్నింటిని కలిపి కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు ఆర్థిక సాయాన్ని రూ.12వేల నుంచి రూ.15వేల వరకు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే రాష్ట్రంలోని మహిళల కోసం అనేక పథకాలను రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక కిట్ స్కీమ్ ను కూడా అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందని, తద్వారా ప్రభుత్వాన్ని మరింత మంచిపేరు వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.
గతంలో కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు శిశువు సంరక్షణకోసం అవసరమైన వస్తువులతోపాటు ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ కిట్ లో బేబీ సోప్, ఆయిల్, దుస్తులు, దోమతెరలు, న్యాప్ కిన్స్ వంటి 16రకాల వస్తువులు ఉండేవి. అలాగే మూడు దశల్లో రూ.12వేల ఆర్థిక సాయం అందేది. ఆడబిడ్డ పుడితే అదనంగా రూ. వెయ్యి ఇచ్చేవారు. కేసీఆర్ కిట్ స్థానంలో బాలింతలకు ప్రత్యేక కిట్ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ప్రతిపాదనలను సిద్ధంచేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
గతంలో కేసీఆర్ కిట్ లో ఇచ్చిన కొన్ని వస్తువులతోపాటు మరికొన్నింటిని కలిపి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. పసిబిడ్డ కోసం బేబీ సోప్, షాంపూ, ఆయిల్, నవజాత శిశువులకు సౌకర్యవంతంగా ఉండేలా మూడు నుంచి నాలుగు జతల బట్టలు, దోమతెర, న్యాప్ కిన్స్, డైపర్లు (నెలకు సరిపడేలా), శిశువును వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్ లేదా చిన్న వస్త్రం, ప్రసవం తరువాత తల్లి అవసరాలకు శానిటరీ ప్యాడ్స్, పోషకాహార పొడి (తల్లిపాలు సరిపోని పిల్లలకు లాక్టోజన్ లాంటిది), థర్మా మీటర్, బేబీ టవల్, కాటన్ బడ్స్, చిన్న బాటిల్, శిశువులకు పాలు తాగించడానికి టీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. వీటికితోడు ఆర్థిక సాయంను రూ.15వేలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.