Bride Suicide : ఉదయం పెళ్లి.. అప్పగింతల సమయంలో పురుగులమందు తాగి నవ వధువు ఆత్మహత్య

ఉదయం పెళ్లి.. అప్పగింతల సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది నవ వధువు.

Bride Suicide : ఉదయం పెళ్లి.. అప్పగింతల సమయంలో పురుగులమందు తాగి నవ వధువు ఆత్మహత్య

Bride Suicide

Updated On : May 14, 2022 / 11:52 AM IST

Bride Suicide : భర్త చనిపోయాడు. ముగ్గురు కూతుళ్లను కష్టపడి పెంచింది తల్లి. పెద్ద కూతురికి వివాహం జరిపిస్తే కాస్త బాధ్యత తీరుతుందని అనుకుందా తల్లి. అలా పెద్ద కూతురుకి దూరపు బంధువుతో పెళ్లి నిశ్చయించి వివాహం జరిపించింది. కానీ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదమ్మా అని కూతురు అన్నా ఏదో చిన్నతనంతో చెబుతోందిలే అని పట్టించుకోకుండా 19 ఏళ్ల పెద్ద కూతురికి వివాహం జరిపించింది. కానీ పెళ్లి బాజాలతో సందడిగా ఉన్న ఆ ఇంటిలో కాస్తా పెళ్లి అయ్యాక నవ వధువు చావుతో ప్రేతకళ నిండుకుంది. కారణం నవ వధువు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే..ఇంటికి కట్టిన పెళ్లి తోరణాలు వాడకముందే..మెడలో కట్టిన పసుపుతాడు పచ్చిదనం ఆరకముందే పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో తల్లి భోరు భోరున ఏడ్చింది. ఎంత పని చేశావు బిడ్డా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చింది.

మహబూబ్ నగర్ జిల్లా పాతతోటలో జరిగిన ఈ ఘటనతో ఆ గ్రామం అంతా విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన గుజ్జల పద్మకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 19 ఏళ్ల పెద్ద కుమార్తె లక్ష్మి పదో తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం ఇంటి వద్దే వుంటోంది. ఇటీవల ఆమెకు అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో వివాహం నిశ్చయమైంది.

ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని లక్ష్మి తన తల్లికి చెప్పింది. అయినప్పటికీ ఆమె మాటలను పెద్దలు పట్టించుకోకుండా శుక్రవారం (మే13,2022) ఉదయం 9 గంటలకు వివాహం జరిపించారు. పెళ్లి బారాత్ లో కూడా వరుడితో కలిసి డ్యాన్స్ ఇష్టం లేకుండానే చేసింది. మధ్యలో వెళ్లిపోతుంటే..ఆమెను బంధువులు తిరిగి తీసుకొచ్చి వరుడితో కలిసి డ్యాన్స్ చేయమన్నారు. అలా తనకు ఇష్టం లేకుండానే బారాత్ లో డ్యాన్స్ చేసింది. అలా తనకు ఇష్టంలేని వివాహం చేసారనే బాధతో కుమిలిపోతునే ఉంది లక్ష్మి. ఈ విషయాన్ని బంధువులు గానీ..కన్నతల్లిగాని పట్టించుకోలేదు. ఇక వివాహం అయిపోయింది అని తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది.

అయితే..వివాహం ఇష్టం లేని లక్ష్మి సాయంత్రం అప్పగింతల సమయానికి ముందు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో అప్పటి వరకు పెళ్లితో కళకళలాడిన ఇంట్లో విషాదం అలముకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.