27 నుంచి స్కూళ్లకు టీచర్లు..సెప్టెంబర్ 01 నుంచి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన ప్రభుత్వ స్కూళ్లు మరలా తెరుచుకోనున్నాయి. కానీ ఆన్ లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు టీచర్లు రెడీ అవుతున్నారు. క్లాసులు నిర్వహంచుకొనేందుకు కేసీఆర్ సర్కార్ ఒకే చెప్పింది.
సెప్టెంబర్ 01 నుంచి ఆన్ లైన్ పద్ధతిలో పాఠాలు చెప్పాలని, ఆలోపు వీటికి సంబంధించిన ఆన్ లైన్ క్లాస్ మెటీరియల్, వీడియో పాఠాలు వంటివి తయారు చేయాలని హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులను ఆదేశించింది. ఇందుకు ఈనెల 27 నుంచి పాఠశాల సిబ్బంది విధులకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ లేదా టీవీ / టీశాట్ ద్వారా బోధించేందుకు విద్యాశాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో 28 వేలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. వీటిలో 30 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తే ఎంతమందికి వెసులుబాటు ఉంటుందనే దానిపై ఇటీవల విద్యాశాఖ పరిశీలన చేసింది.
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలు సేకరించింది. దాదాపు సగానికిపైగా విద్యార్థుల ఇళ్లలో టీవీలు, కేబుల్ లేదా డిష్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు.
రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే డిజిటల్ పాఠాలను నేర్చుకోవడంతో పాటు వాటిని ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన వర్క్‌షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ విడుదల చేసింది. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్ సైట్ (https : // scert.telangana.gov.in / Worksheets_24082020 / mobile / index.html) ద్వారా 2-10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకొనే విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బీ శేషుకుమారి తెలిపారు.