ఏఎంబీఐఎస్ టెక్నాలజీతో క్రిమినల్స్ ఆటకట్టిస్తున్న తెలంగాణ పోలీసులు.. రష్యా తరువాత హైదరాబాద్‌లోనే..
ఎలాంటి కేసులోనైనా సరే పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తారు. ఇలా నేరం జరిగిన ప్రాంతంలో లభించిన వేలిముద్రల ఆధారంగా అనుమానితుల ..

AMBIS technology
Telangana Police: తెలంగాణ పోలీసులు సరికొత్త టెక్నాలజీతో నేరస్థుల ఆటకట్టిస్తున్నారు. నేరాలు చేసి తప్పించుకు తిరిగే అంతర్రాష్ట్ర ముఠాలను, సైబర్ నేరగాళ్లను ఆన్ లైన్ లో ట్రేస్ చేసి అరెస్టులు చేస్తున్నారు. దేశంలో ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. ‘ఆటోమెటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఎంబీఐఎస్) ద్వారా పోలీసులు క్రిమినల్స్ ఆటకట్టిస్తున్నారు. ఈ సిస్టమ్ ద్వారా గతేడాది 507 కేసులను ట్రేస్ చేసిన పోలీసులు.. వివరాలు తెలియని 71 డెడ్ బాడీలను గుర్తించారు.
2017 నుంచి రాష్ట్రంలో ‘ఆటోమేటిక్ ఫింగర్ ఫ్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’ పాపిలాన్ టెక్నాలజీ ద్వారా కేసులను ఛేదిస్తున్న పోలీసులు.. గతేడాది నుంచి ఏఎంబీఐఎస్ టెక్నాలజీ ద్వారా క్రిమినల్స్ ఆటకట్టిస్తున్నారు. ఈ విధానం ద్వారా దేశంలో ఎక్కడ నేరం చేసినా నేరస్థులను గుర్తించే విధంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) తో అనుసంధానం చేశారు. నిందితుల ఆధార్, ఫింగర్ ప్రింట్ తో ఆన్ లైన్ సెర్చింగ్ చేస్తుంటారు.
ఎలాంటి కేసులోనైనా సరే పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తారు. ఇలా నేరం జరిగిన ప్రాంతంలో లభించిన వేలిముద్రల ఆధారంగా అనుమానితుల వేలిముద్రలను పోల్చి చూస్తుంటారు. ఫింగర్ ప్రింట్ స్లిప్స్, ఫొటోలను లైవ్ డిజిటల్ స్కానర్లతో రికార్డ్ చేస్తున్నారు. నేరం చేసిన వ్యక్తి తాత్కాలికంగా తప్పించుకున్నప్పటికీ.. కొన్ని నెలలు, సంవత్సరాల తరువాతనైనా ఫింగర్ ప్రింట్స్ తో పట్టేస్తున్నారు. ఇలాంటిదే న్యూరల్ నెట్ వర్కింగ్ సిస్టమ్. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో కలిపి ఏఎంబీఐఎస్ టెక్నాలజీ రూపొందింది. అయితే, ఈ టెక్నాలజీ రష్యా తరువాత మన దేశంలో వినియోగించడంలో రాష్ట్ర పోలీసులు ముందువరుసలో ఉన్నారు.
ఏఎంబీఐఎస్ టెక్నాలజీ పూర్తిగా ఏఐపై పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా నేరస్థుల వేలిముద్రలు, ఐరిష్ స్కాన్, ఫేస్ ఫీచర్స్, పాద ముద్రలతో ఎత్తు, బరువును అంచనా వేస్తారు. వీటితో పాటు ఫోర్జరీ కేసుల్లో సంతకం, చేతిరాతను కూడా పరిశీలిస్తుంటారు. ఇందుకోసం సీన్ ఆఫ్ అఫెన్స్ లో వేలిముద్రలతోపాటు ఇతర బయోమెట్రిక్ వివరాల సేకరణకు ఏఎంబీఐఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఇది న్యూరల్ నెట్ వర్క్ సిస్టమ్ ఆధారంగా ఫింగర్ ప్రింట్ ద్వారా నిందితులను గుర్తిస్తుంది. పోలీస్ డేటా బేస్ లో అందుబాటులో ఉన్న ఫేషియల్ ఇమేజ్ లతో పోల్చేందుకు న్యూరల్ నెట్ వర్క్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. గతేడాది వరకు దేశంలో సేకరించిన 9.3లక్షల ఫింగర్ ప్రింట్స్ డేటా రాష్ట్ర పోలీసుల వద్ద అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా నేరస్తులకు సంబంధించిన డేటాను విశ్లేషించడం, సమాచార సేకరణలోనూ న్యూరల్ నెట్వర్క్ సిస్టమ్, ఏఐతో కలిపి రూపొందిన ఏఎంబీఐఎస్ టెక్నాలజీ మంచి ఫలితాలను ఇస్తుంది.