మీ సమస్యలు చెప్పండి : ప్రజల దగ్గరికే పోలీస్ సేవలు

.
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రజల వద్దకే పోలీసు సేవలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకరూప పోలీసింగ్ పేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రజల దగ్గరకు పోలీసు పేరుతో 15 రోజుల పాటు అన్ని గ్రామాలు, కాలనీలు, అపార్ట్ మెంట్ లు ఇలా అన్ని ప్రాంతాల్లో సంబంధిత శాంతి భద్రతల విభాగం పోలీసులు పర్యటిస్తారు. ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇంకా పోలీస్ శాఖ నుంచి ఎలాంటి పేవలు కావాలో ఆరా తీయనున్నారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్ల నుంచి వచ్చిన అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రస్తుతం మహిళా సంబంధిత నేరాల్లో బాధితుల ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు అదే రీతిలో టీఎస్ కాప్ ద్వారా సంఘటనా స్థలంలోనే కేసులు నమోదు చేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏక రూప పోలీసింగ్ విధానం అమలు కోసం ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు డీజీపీ తెలిపారు.