తెలంగాణలోని రైతులకు శుభవార్త.. అసైన్డ్ భూములపై కీలక నిర్ణయం!
దానికే ఇప్పుడు సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

Cm Revanth Reddy
తెలంగాణలో అసైన్డ్ భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తుంది. ఆ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న అసైన్డ్ భూములపై వివరాలు తీసుకుంటోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆ భూములకు ఎటువంటి హక్కులు కల్పించారో సైతం అధ్యయనం చేసే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం కలిపి 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని తెలిసింది.
ఆ భూముల్లో డిజిటల్ సైన్ కానివి 5.36 లక్షల ఎకరాలు ఉండగా, పోడు రైతులతో పాటు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు కొనుగోళ్లు, అమ్మకాల్లో అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది. మూడేళ్ల క్రితం వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా రైతులకు ఎటువంటి హక్కులు కల్పించాలన్న విషయంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.
చాలా మంది రైతులు వారికి ఇచ్చిన అసైన్డ్ భూములను విక్రయించినట్లు తెలిసింది. అవన్నీ నోటరీల మీదే జరగడం గమనార్హం. దళితులతో పాటు గిరిజనులు, పేదలకు ఇచ్చిన అసైన్డ్ పట్టాలకు ఒకవేళ యాజమాన్య హక్కులు కల్పిస్తే వారు వాటిని తమ అవసరాల మేరకు విక్రయించుకునే అవకాశం ఉంటుందని సర్కారు భావిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో దశల వారీగా ప్రభుత్వ భూములను అసైన్డ్ చేశారు. అసైన్డ్ చట్టం ప్రకారం భూమిని పొందిన యజమాని మినహా ఇతరులు ఎవ్వరికీ దానిపై అధికారం ఉండదు. అలాగే, అమ్మడానికి, దానం చేయడానికి, బహుమతిగా ఇవ్వడానికి వీలు లేదు.
అప్పట్లో సర్కారు అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానికే ఇప్పుడు సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ భూములను ఎంత కాలం కింద కేటాయిస్తే వాటికి హక్కులు కల్పించాలనే దానిపై గవర్నమెంట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.