విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఇంజినీరింగ్ బి-కేటగిరి సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల.. నిబంధనలు ఇలా.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీకి రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) షెడ్యూల్ విడుదల చేసింది.

TG Engineering Seats
TG Engineering Seats: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీకి రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకూ ప్రైవేటు కాలేజీల్ల్లో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్టు 14 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని టీజీసీహెచ్ఈ వెల్లడించింది.
కన్వీనర్ కోటా కింద 70శాతం సీట్లను ప్రభుత్వం కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన 30శాతాన్ని బీ కేటగిరీగా పిలుస్తారు. ఏఐసీటీఈ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఎప్‌సెట్-2025, జోసా, సీఎస్ఏబీ తదితర అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను సమన్వయం చేసుకుంటూ ఎప్ సెట్ బీ-కేటగిరి సీట్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.tgche.ac.in వెబ్ సైట్ ను చూడాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో భారీగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీ-కేటగిరీలోనూ సుమారు 33వేల వరకూ సీట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది బీ-కేటగిరీ కింద 27,936సీట్లు భర్తీ అయ్యాయి.
నిబంధనల ప్రకారం..
ప్రతి కాలేజీ కనీసం మూడు పేపర్లలో బీ-కేటగిరి సీట్ల అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో బ్రాంచుల వారీగా మేనేజ్‌మెంట్, ఎన్ఆర్ఐ సీట్లు, దరఖాస్తు ఫార్మాట్, చెల్లించాల్సిన ఫీజు, ట్యూషన్ ఫీజు వివరాలను పెట్టాలి. దరఖాస్తు తేదీలు, వాటిని ఎక్కడ ఇవ్వాలనే వివరాలు కూడా నోటిఫికేషన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.