హైదరాబాద్ లో కొనసాగుతోన్న కరోనా కల్లోలం… గ్రేటర్ లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు

హైదరాబాద్ నగరంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు రానున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ ప్రారంభంలో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్ జోన్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎక్కువ కేసులు వచ్చిన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ ఏర్పాటు చేసేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే నగరంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశం అధికారులను వేధిస్తోంది.
రోజూ వెయ్యిపైగా కేసులు నమోదు
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా విలయం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వారం రోజులుగా వెయ్యికిపైగానే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన మూడు నెలలు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 1655 కేసులు నమోదవ్వగా… జూన్‌లో మాత్రం ఆ సంఖ్య 11వేలు దాటింది. ఇక గడిచిన ఆరు రోజుల్లో 7వేల 8వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇలా రోజురోజుకు కేసులు పెరిగిపోతుండడంతో వాటికి అడ్డుకట్ట వెయ్యాలంటే కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని బల్దియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఎక్కువ కేసులు నమోదవుతున్న చోట మళ్లీ కంటైన్‌మెంట్ జోన్స్
లాక్‌డౌన్ సమయంలోనే హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కొన్ని సందర్భాల్లో 200 వరకు కంటైన్‌మెంట్ జోన్లు నగరంలో వచ్చాయి. అయితే లాక్‌డౌన్ సడలించడం, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ మార్చడంతో ఇంటి వరకు మాత్రమే హౌజ్ క్లస్టర్ ఏర్పాటు చేసింది జీహెచ్‌ఎంసీ. ఇప్పుడు ఎక్కువ కేసులు వస్తోన్న చోట.. కంటైన్‌మెంట్లు ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.
కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటుపై సందిగ్దత
గతంలో ఒక సర్కిల్‌లో 25 నుంచి 30 కేసులు నమోదైతే… కంటైన్‌మెంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రతి సర్కిల్‌లోనూ వందల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. యాక్టివ్ కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని ఇళ్లల్లో ఐదుగురి నుంచి పదిమందికి కూడా పాజిటివ్ వస్తోంది. దీంతో ఎలాంటి ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తారన్నదానిపై సందిగ్దత నెలకొంది. గతంలోలాగానే ఎక్కువ ఇళ్లను జోన్ పరిధలోకి తీసుకోవాలా… లేదా ఎన్ని ఇళ్లను కంటైన్‌మెంట్ చేయాలన్నది అధికారులకు తలనొప్పిగా మారింది.
మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఎర్పాటు చేస్తే ఇబ్బందులు
హైదరాబాద్ సిటీలో లాక్‌డౌన్ సడలింపులు రావడంతో ఎక్కువ మంది వివిధ పనుల కోసం బయటికి వస్తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఎర్పాటు చేస్తే …. ఉద్యోగాలకు రావాలన్నా…. బయటి ప్రాంతాల్లో ఉన్న వ్యాపార కార్యకపాలను నిర్వహించాలన్న ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అలాంటి వారికి ఎలాంటి అనుమతులు ఇస్తారో….., లేక పూర్తి స్థాయిలో కంటైన్ చేస్తారో చూడాలి.