మొన్న లగచర్ల.. నిన్న దిలావర్ పూర్.. ఇప్పుడు హెచ్‌సీయూ.. కారణమిదేనా?
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సందర్భాల్లో సరైన సమయంలో స్పందించలేదనేది పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్.

CM Revanth Reddy
మొన్న లగచర్లలో ఫార్మా క్లస్టర్ నుంచి వెనక్కి తగ్గడం.. నిన్న దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీని విరమించుకోవడం.. తాజాగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం.. ఇలా వరుస ఘటనల్లో కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొంటోందా.. ఈ మూడు ఘటనల వెనుక కాంగ్రెస్ పెద్దల మౌనమే కారణమా? కాంగ్రెస్ నేతలు సరైన సమయంలో స్పందించి ఉంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేదే కాదా..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లగచర్ల, దిలావర్ పూర్, కంచ గచ్చిబౌలి రగడ గురించే. వికారాబాద్ జిల్లా లగచర్లలో రైతులు జిల్లా కలెక్టర్‌పై తిరగబడడం సంచలనం రేపింది.
లగచర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టిన రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రైతులు, స్థానికులతో పాటు ప్రతిపక్షాల నుంచి నిరసనలు తలెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇది తమ విజయమని బీఆర్ఎస్ చెప్పుకుంది.
లగచర్లలో రైతుల నుంచి సేకరించిన భూముల్లో మొత్తం ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ముందు చెప్పకపోవడం కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పిదమని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. ముందే రైతులకు ప్రభుత్వం విడమర్చి చెప్పి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదన్న చర్చ అప్పట్లో జరిగింది.
ఈ పనేదో ముందే చేసి ఉంటే బాగుండేది కదా?
ఇక దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీవో మీద దాడిచేసే దాకా వెళ్ళింది. ఈ వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ ఆందోళనకి దిగింది. ఐతే ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నది అసలు విషయం. దీనిపై ప్రభుత్వం ముందుగా క్లారిటీ ఇవ్వలేదు.. మంత్రి సీతక్క రంగంలోకి దిగే వరకు కూడా అసలు విషయం బయటకు రాలేదు. ఈ పనేదో ముందే చేసి ఉంటే రైతుల్లో అంత వ్యతిరేకత వచ్చి రోడ్డెక్కేవాళ్ళు కాదనే అభిప్రాయం వ్యక్తవుతోంది.
ఇక ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పొరపాటు చేసిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మాలని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ఐటీ, ఇండస్ట్రీయల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఐతే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు గళం విప్పారు. ఆ తర్వాత ప్రతిపక్షపార్టీలు, పర్యావరణవేత్తలు, సినీ రంగ ప్రముఖులు ఎంటరయ్యారు. అభివృద్ధి కోసం అడవుల్ని లేకుండా చేస్తారా అనే ప్రశ్నమొదలైంది. పర్యావరణాన్ని నాశనం చేయవద్దనే వాదన తెరపైకి వచ్చింది. విషయం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్లింది.
యూనివర్సిటీలో చెట్లను నరికివేయడంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో ఈ వ్యవహారంపై మంత్రులతో కమిటీ వేసింది. ఈ కమిటీ సభ్యులు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది. ఐతే కంచ గచ్చిబౌలి భూముల్ని అమ్మాలని నిర్ణయం తీసుకున్నాక విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హెచ్‌సీయూ స్టూడెంట్స్‌తో పాటు పర్యావరణ వేత్తలతో సంప్రదింపులు జరిపి వాళ్లను ఒప్పించి ముందుకు వెళ్లుంటే ఈ సమస్య వచ్చేది కాదనేది కాంగ్రెస్‌లోనే వినిపిస్తున్న ఇన్నర్ టాక్. కానీ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లాక, న్యాయస్థానాలు సీరియస్ అయ్యాక ఇప్పుడు మంత్రుల కమిటీ వేసి సంప్రదింపులు జరిపినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సందర్భాల్లో సరైన సమయంలో స్పందించలేదనేది పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్. అనుభవజ్ఞలైన అధికారులు, సీనియర్ మంత్రులు ఉన్నా.. అనుభవలేమితో వ్యవహరించారన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై వచ్చిన వ్యతిరేకతను ప్రాథమిక స్థాయిలోనే పరిష్కరించే అవకాశమున్నా. సర్కార్ మాత్రం తెగేదాకా లాగిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.