KTR: ఇందుకే కేటీఆర్ పాదయాత్రకు ప్లాన్ చేశారా?

కేటీఆర్ పాదయాత్ర ప్రకటన వెనుక స్వామికార్యం.. స్వకార్యం రెండూ ఉన్నాయని అనుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు.

KTR: ఇందుకే కేటీఆర్ పాదయాత్రకు ప్లాన్ చేశారా?

KTR

Updated On : March 21, 2025 / 8:02 PM IST

తెలంగాణ పాలిటిక్స్‌లో బీఆర్ఎస్ లీడర్ల స్టేట్‌మెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉన్న నేతలు.. తర్వాత నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా అయితే రేపే ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా రాజకీయ వేడిని రాజేస్తోంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటన చేపట్టారు కేటీఆర్. మొదటి జిల్లా పర్యటనలోనే సూర్యాపేట వేదికగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తానని తెలిపారు. అలంపూర్ టు ఆదిలాబాద్.. వయా హైదరాబాద్ మీదుగా పాదయాత్ర రూట్ మ్యాప్‌ కూడా సిద్ధం చేసుకున్నారట కేటీఆర్.

అధికారమే లక్ష్యంగా..ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా కేటీఆర్ పాదయాత్ర ఉండబోతోందట. వచ్చే ఏడాది మొదలయ్యే ఈ పాదయాత్ర దాదాపు 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..పదేళ్ల బీఆర్ఎస్ పాలనను గుర్తు చేస్తూ..మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట కేటీఆర్.

15 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇలాంటి టైమ్‌లోనే ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారట గులాబీ నేతలు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం, ఆందోళనలు చేస్తూనే వచ్చే ఏడాది కేటీఆర్ పాదయాత్ర చేసేలా ప్లాన్ చేస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. అయితే కేటీఆర్ పాదయాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న చర్చ జరుగుతోంది. పాదయాత్ర చేసిన నేతలు సీఎం అవుతారన్న సెంటిమెంట్ ఉంది.

ఇలా పాదయాత్ర చేసిన లీడర్లంతా సీఎంలు
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నుంచి మొదలు చంద్రబాబు, జగన్, రేవంత్‌రెడ్డి ఇలా పాదయాత్ర చేసిన లీడర్లంతా సీఎంలు అయ్యారు. ఆ సెంటిమెంట్‌లో భాగంగానే కేటీఆర్ పాదయాత్రకు ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఫ్యూచర్‌ లీడర్‌గా, కేసీఆర్‌ తర్వాత కేటీఆరే బీఆర్ఎస్ రథసారధి అనేలా తనను తాను లీడర్‌గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారట. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ పాదయాత్ర చేశారు కాబట్టే అధికారంలోకి వచ్చిందని..ఆయన్నే సీఎం చేయాలని క్యాడర్‌, లీడర్లతో పాటు పబ్లిక్‌ నుంచి పాజిటివ్‌ టాక్ వస్తుందని కూడా భావిస్తున్నారట.

అయితే కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కేటీఆర్ కోరుకుంటున్నారని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. తాను సీఎం కావాలన్నదాని కంటే..కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొబెట్టాలనే కసితో కేటీఆర్ ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే రెండన్నరేళ్ల ముందే కేటీఆర్‌ పాదయాత్ర చేపట్టడానికి మెయిన్‌ రీజన్ జమిలి ఎన్నికల వస్తాయన్న ఊహాగానాలేనట.

జమిలి ఎన్నికలకు ఇప్పటికే ఆమోద ముద్ర లభించింది. 2026లో నియోజకవర్గాల డీలిమిటేషన్‌ జరగబోతుంది. జనాభా లెక్కలు కూడా అప్పుడే జరగబోతున్నాయి. ఈ లెక్కన 2027 చివరిలో కానీ..2028 స్టార్టింగ్‌లో కానీ జమిలి ఎన్నికలు వస్తాయని అంచనా వేస్తున్నారట. ఆ ముందస్తు వ్యూహం ప్రకారమే వంద నియోజకవర్గాలను చుట్టేసేలా..రాష్ట్రమంతా పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారట కేటీఆర్.

ఇలా కేటీఆర్ పాదయాత్ర ప్రకటన వెనుక స్వామికార్యం.. స్వకార్యం రెండూ ఉన్నాయని అనుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు. పార్టీని అధికారంలోకి తేవాలని పట్టుదల ఒకటైతే. జమిలి ఎన్నికల వస్తాయనే ముందస్తు ప్లాన్ మరొకటని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ భవిష్యత్‌ నాయకుడిగా లీడర్, క్యాడర్ల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా యాక్సెప్టెన్స్ పొందేలా వ్యూహం రచిస్తున్నారట కేటీఆర్. కేటీఆర్ పాదయాత్ర చేస్తారా.? ఒకవేళ పాదయాత్ర చేస్తే అది ఎంతవరకు పార్టీకి, కేటీఆర్‌కు మైలేజ్‌ను తీసుకొస్తుందో చూడాలి మరి.