fire to the huts : పేదల గుడిసెలకు నిప్పు పెట్టి..మహిళలను..చిన్నారుల్ని చితకబాదిన దుండగులు

fire to the huts : పేదల గుడిసెలకు నిప్పు పెట్టి..మహిళలను..చిన్నారుల్ని చితకబాదిన దుండగులు

Thugs Who Set Fire To The Poor Huts

Updated On : May 13, 2021 / 1:00 PM IST

thugs who set fire to the poor huts : పేదల గుడిసెలకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు.దీంతో పేదల బతుకులు రోడ్డుపడిన విషాద ఘటన వ‌రంగ‌ల్ రూరల్ జిల్లాలోని చోటుచేసుకుంది. న‌ర్సంపేట కాక‌తీయ న‌గ‌ర్ వ‌ద్ద అసైన్డ్ భూముల్లో నిరుపేదలు గుడిసెల‌ు వేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది దుండగులు వారి గుడిసెలకు నిప్పు పెట్టటం గుడిసెలన్నీ కాలి బుగ్గి అయిపోయాయి. దీంతో పేదలంతా కంటికి కడివెడు కన్నీరుగా విలపిస్తున్నారు. దుండగులు గుడిసెలకు నిప్పు పెడుతుండగా కొంతమంది మహిళలు వారిని అడ్డుకోగా..మహిళలతో పాటు చిన్నారులకు కూడా దారుణంగా చితకబాదారు. ఏకంగా 40మంది దుండగులు పేదల గుడిసెలమీద విరుచుకుపడ్డారు. నిప్పు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తులు, మహిళలు వారిలో కొంతమందిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు..పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో తాము పట్టుకున్న దుండగులను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ దారుణం ఎవరు చేశారో తెలీదనీ..తమ జీవితాలను బుగ్గిపాలు చేసిన వారిని..ఈ దారుణానికి పాల్పడటం వెనుక ఎవరున్నారో తేల్చి వారిని కఠినంగా శిక్షించాలని మహిళలు పోలీసులను కన్నీటితో వేడుకున్నారు. మా జీవితాలను నడిరోడ్డుమీదకు నెట్టేసిన వారిని కనిపెట్టి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాకతీయ నగర్ లోని 601 సర్వే నంబర్ లోని అసైన్డ్ భూముల్లో నిరుపేదలు రెండు నెలల క్రితం గుడిసెలు వేసుకున్నారు. అక్క‌డ మొత్తం 300 గుడిసెల్లో పేద‌లు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో కొంతమంది కబ్జాదారుల కళ్లు ఈ అసైన్డ్ భూములపై పడ్డాయి. అంతే పేదలను గుడిసెలు ఖాళీ చేయమని బెదిరింపులకుదిగారు. కానీ పేదలు ఇవి ఎవరి సొంత భూములు కాదనీ..మేమెందుకు ఖాళీ చేయాలని ప్రశ్నించారు. దీంతో కొంతమంది వ్యక్తులు దుండగులను పంపించి గుడిసెలకు నిప్పు పెట్టారని తెలుస్తోంది.

రెండు రాజకీయ పార్టీలకు చెందిన భూ కబ్జాదారులే ఈ దారుణానికి పాల్పడ్డారని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గుడిసెలకు నిప్పు పెట్టిన దుండగులు అడ్డువచ్చిన మహిళలను, వృద్ధులను, చిన్నపిల్లను కూడా దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు బాధితులు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. ఘ‌ట‌నాస్థ‌లాన్ని పరిశీలించిన పోలీసులు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ ప్రారంభించారు.