మనిషి రక్తం రుచి మరిగిన పులి ? …..భయంతో వణుకుతున్న గ్రామాలు

  • Published By: murthy ,Published On : December 2, 2020 / 07:42 AM IST
మనిషి రక్తం రుచి మరిగిన పులి ? …..భయంతో వణుకుతున్న గ్రామాలు

Updated On : December 2, 2020 / 11:32 AM IST

tigers who have already killed two in telangana : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఇద్దర్ని పెద్దపులి పొట్టన పెట్టుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోని రెండు గ్రామాల్లో ఈ సంఘటనలు జరిగాయి. పులుల దాడితో అటవీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఈ ఇద్దరిని చంపింది ఒకే పులా? లేకా మరొకటా ? అది మహారాష్ట్ర నుంచి వచ్చిందా? అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు మహబూబాబ బాద్ జిల్లాలోనూ పులి సంచారం గ్రామస్తులను వణికిస్తోంది.

సుమారు 20రోజుల క్రితం ఆసిఫాబాద్‌ కుమ్రంభీం జిల్లా దహేగాం మండలం దిగడ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు విఘ్నేశ్‌పై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మరువకముందే.. పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలికపై పులి దాడి చేసి హతమార్చింది. ఈ రెండు ఘటనలకు పాల్పడిన పులి ఒక్కటేనా?.. వేర్వేరా అన్నది అధికారులు నిర్ధారించాల్సి ఉన్నది. బాలిక కుటుంబానికి అటవీశాఖ రూ. 5 లక్షల సాయం అందించింది. మరో రూ.5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం సైతం ఇప్పిస్తామని అటవీ అధికారులు చెప్పారు.


సాధారణంగా ఒక పెద్దపులి 60 నుంచి 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తుంది. ఈ పరిధిలోకి వేరే పులిని రానివ్వదు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులిని లోనికి రానివ్వకపోవడంతోనే అవి ఇలా గ్రామాల మీదకు వస్తున్నాయా? మనిషి రక్తం రుచి మరిగిన పులులు వేట కొనసాగిస్తున్నాయా? అనేది చర్చనీయాంశమైంది. వీటిని గుర్తించేందుకు 19 బృందాలు, 4 ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ పనిచేస్తున్నాయి. అటవీ శాఖ సీసీ కెమెరాలను అమర్చడంతోపాటు అత్యాధునిక టెక్నాలజీని కూడా వినియోగిస్తోంది.


కవ్వాల్‌లో అభయారణ్యంలో 7 పులులు
కవ్వాల్‌ అభయారణ్యంలో ఇప్పటికే ఏడు పెద్దపులులున్నాయి. వాటిలో ఒక ఆడ, రెండు మగ పులులతోపాటు నాలుగు పిల్లలున్నాయి. పిల్ల పులుల్లో రెండు ఆడ, రెండు మగ. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యం నుంచి ఏటూరు నాగారం మీదుగా ములుగు, తాడ్వాయి, భూపాలపల్లి, కొత్తగూడ, గూడూరు ప్రాంతాల్లో రెండు పులులు సంచరించినట్టు ఆనవాళ్లు దొరికాయి.

పెద్దపులి కదలికలను వేగంగా తెలుసుకునేందుకు అటవీశాఖ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నది.దీనిపై అటవీశాఖ ఉన్నతాధికారులు.. అధికారులు, సిబ్బందికి ఇటీవల రామగుండం, ములుగులో ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. పెద్దపులి ఫొటో ఒక్కటి దొరికితే రంగును బట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది.. దాని తల్లి ఎవరు..? తదితర సమగ్ర వివరాలు తెలుసుకొనే వీలుంటుంది.

పలుచోట్ల పులి ఆనవాళ్లు
ఏటూరు నాగారం, పాకాల, ములుగు, తాడ్వాయి, భూపాలపల్లి, కొత్తగూడ, గూడూరు, మహదేవ్‌పూర్‌, చెన్నూరు అటవీప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు దొరికాయి. మహదేవ్‌పూర్‌, చెన్నూరు సరిహద్దులకు మహారాష్ట్రలోని సిరోంచ, తడోబా అటవీప్రాంతాల నుంచి మరోపులి వచ్చినట్టు తెలుస్తున్నది. జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ పులి సంచరించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి.


రెండు పులుల సంచారంపై అటవీశాఖ సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నది. ఇదిలా ఉండగా జయశంకర్‌భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో రెండు నెలలుగా రెండు పెద్దపులులు సంచరిస్తున్నాయి. వీటి జాడను గుర్తించేందుకు పాదముద్రలను సేకరిస్తున్నారు. అటవీ గ్రామాల్లో తిరిగి అవగాహన పెంచుతున్నారు. ఒకటి కాదు రెండు పెద్దపులులు వచ్చాయని, అవి స్థిరంగా ఉండటం లేదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. వాటి ఆవాసానికి అనుగుణంగా అడవుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.