Mahesh Goud : పోచారం వ్యాఖ్యలు, కేటీఆర్ పాదయాత్రపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సంచలన కామెంట్స్..
Mahesh Goud : బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చిన మాకు ఇబ్బంది లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని మహేశ్ గౌడ్ దీమా వ్యక్తం చేశారు.
Mahesh Goud
- పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ రియాక్షన్
- ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు
- బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చిన మాకు ఇబ్బంది లేదు
Mahesh Goud : బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా.. పోచారం వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పోచారం అర్థం చేసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టి పలాయనం చిత్తగించారు. ప్రతినెల 7వేల కోట్ల వాయిదాలు చెల్లిస్తున్నాం. ఈ కారణంగా నిధుల విడుదల ఆలస్యం అవుతుందని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ఇదేక్రమంలో కేటీఆర్ పాదయాత్ర అంశంపైనా ఆయన స్పందించారు.
కేటీఆర్ రెండు విషయాలు స్పష్టంగా ఒప్పుకున్నారు. వారి హయాంలో దోపిడీ, దౌర్జన్యం చేశామని ఒప్పుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు. అందుకు స్వాగతిస్తాం. కానీ, పాదయాత్రలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. 10ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. సింగరేణిలో విద్యుత్ కొనుగోళ్లలో బీఆర్ఎస్ అవినీతి చెరిపేస్తే చెదిరేది కాదని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చిన మాకు ఇబ్బంది లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని మహేశ్ గౌడ్ దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవు.. క్రమశిక్షణలో కాంప్రమైజ్ ఉండదని పేర్కొన్నారు. కవితకు మాకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టుకున్నా స్వాగతిస్తామని అన్నారు. వారి కుటుంబ వాటాల పంచాయితీ మాకు అంటగట్టవద్దని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
పోచారం ఏమన్నారంటే..?
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రులు కాళ్లు మొక్కాల్నా? నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి 20సార్లు చెప్పా.. అయినా పట్టించుకోలేదు. మంత్రిగా పనిచేసిన, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎమ్మెల్యేల ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోతే ఎలా..? గతంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పిండు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు లేపరు. ప్రభుత్వం ఉందా.. ఉంటే అది పనిచేస్తుందా.. అనేది అనుమానం కలుగుతుందని పోచారం అన్నారు.
