హ్యాట్సాఫ్ సార్ : హెల్మెట్ పెట్టుకోవాలని సొంత కొడుక్కి చెప్పినట్టు చెప్పిన ట్రాఫిక్ పోలీస్
ఎన్ని ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చినా, భారీగా ఫైన్లు వేస్తున్నా, జైలుకి పంపిస్తున్నా.. కొందరు వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండానే రోడ్డెక్కుతున్నారు.

ఎన్ని ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చినా, భారీగా ఫైన్లు వేస్తున్నా, జైలుకి పంపిస్తున్నా.. కొందరు వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండానే రోడ్డెక్కుతున్నారు.
ఎన్ని ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చినా, భారీగా ఫైన్లు వేస్తున్నా, జైలుకి పంపిస్తున్నా.. కొందరు వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండానే రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. తీవ్రంగా గాయపడి మంచాన పడుతున్నారు. కొందరు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని తెలిసినా.. కేర్ లెస్ గా ఉంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు.. హెల్మెట్ ధరించమని చెప్పి చెప్పి విసుగెత్తిపోతున్నారు. వాహన తనిఖీల్లో దొరికినప్పుడు వాహనదారులకు ఫైన్లు వేసి పంపేస్తున్నారు. కొందరు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇది నిత్యకృత్యం. రోజూ జరిగేదే.
కానీ.. ఓ ట్రాఫిక్ ఎస్ఐ మాత్రం.. హెల్మెట్ ధరించాలని ఒక వాహనదారుడికి ఎంతో గారాబంగా చెప్పారు. సొంత కొడుక్కి చెప్పినట్టు ప్రేమగా చెప్పారు. హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే నష్టం, ప్రమాదం గురించి వివరించి హితబోధ చేశారు. బిడ్డా.. అంటూ అతడికి క్లాస్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఎస్ఐ తీరుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ప్రేమగా చెప్పారు సార్ అని.. కితాబిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే ఒక జంట బైక్ పై ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ ఎస్ఐ వారిని ఆపారు. హెల్మెట్ లేకపోవడం చూసి అతడికి క్లాస్ తీసుకున్నారు. ”నువ్వు ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు. నీ వెనుక కూర్చున్న నీ భార్యకి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? నీకు కూడా దెబ్బలు తగులుతాయి కదా. ప్లీజ్ అర్థం చేసుకో బిడ్డ.. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కొంపలేమీ మునగవు. బరువేం కాదుగా.. ఎందుకు హెల్మెట్ పెట్టుకోవు? చెయ్యి విరిగితే అతుకుతుంది. కాలు విరిగితే అతుకుతుంది. కానీ తలకు తగిలితే డేంజర్ బిడ్డ.. చెప్పలేము.. కోమాలోకి వెళ్లొచ్చు. చిన్న చిన్న ప్రమాదాలే కోమాలోకి పంపొచ్చు. చెప్పేది నీ మంచి కోసమే కదా బిడ్డ’ అంటూ ఆ వ్యక్తిని ట్రాఫిక్ ఎస్ఐ ప్రేమగా మందలించారు.
ఆ తర్వాత.. ఏమనుకోకు బిడ్డ, ఒక ఫైన్ ఉంటుంది రూ.300 వందలు కట్టి జాగ్రత్తగా వెళ్ళండి.. అమ్మా..నీ భర్తకు ఒక హెల్మెట్ కోనివ్వు బిడ్డ.. అంటూ చాలా గౌరవంగా చెప్పి పంపేశారు ఆ ఎస్ఐ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ మాత్రం కోపం చేసుకోకుండా, రుబాబు చూపకుండా.. ఎంతో ప్రేమగా, గౌరవంగా, కొడుక్కి చెప్పినట్టు ఆ ట్రాఫిక్ ఎస్ఐ మందలించిన తీరు.. నెటిజన్లను ఫిదా చేసింది. హ్యాట్సాఫ్ సార్..సలామ్ సార్..అని నెటిజన్లు ఆ ట్రాఫిక్ ఎస్ఐపై ప్రశంసలు కురిపిస్తున్నారు.